‘ఆ కాలి బూటు బిగ్గట్టినాడో.. తొడగొట్టి వేట మొదలెట్టినట్టే.. ’అంటూ భీమ్లానాయక్ గురించి చెబితే అభిమానులు ఊగిపోరూ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భాంగా ఆయన నటిస్తున్న భీమ్లానాయక్ చిత్రంలోని టైటిల్ సాంగ్ ను ఈరోజు విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యంతో ఈ పాట రూపొందింది. మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. వచ్చే సంక్రాంతికి ‘భీమ్లానాయక్’ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలు పోషించారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త ఇది. ‘వకీల్ సాబ్’ తర్వాత విడుదల కాబోయే పవన్ కళ్యాణ్ సినిమా ఇది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందే ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళ సినిమాలో పాటకు పెద్దగా స్కోప్ లేదు. కానీ తెలుగులో పవర్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని పాటల మీద ప్రత్యేక దృష్టిపెట్టారు.
ఈ సినిమా ఆడియో హక్కులను దాదాపు రూ. 5 కోట్లకు ఆదిత్య మ్యూజిక్ సంస్థకు విక్రయించినట్టు సమాచారం. ఈ సినిమా మేకింగ్ విషయంలో త్రివిక్రమ్ హస్తం ఉండటం కూడా సినిమా మీద హైప్ పెరగడానికి కారణమైంది. పవర్ స్టార్ తో దర్శకుడు సాగర్ కె. చంద్ర మొదటిసారి సినిమా చేస్తున్నారు. ఈ రోజు 11. 16 గంటలకు ఈ టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘మండుతున్న రైఫిల్స్ ప్రతిధ్వనించడానికి సిద్ధమవుతున్నాయి. పవర్ యాంథమ్‌తో పవర్‌డేను సెలబ్రేట్ చేసుకుందాం’ అంటే సాగర్ చంద్ర ట్వీట్ చేశారు.
పక్కా మాస్ మసాలా సాంగ్
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పక్కా మాస్ మసాలా సాంగ్ అనే చెప్పాలి. రామజోగయ్య శాస్త్రి తండాల్లో పదాలన్నీ ఏర్చికూర్చి ఈ పాటను తయారు చేసినట్టుంది. ‘ఆడాకాదు ఈడాకాదు…అమిరోళ్ళ మేడ కాదు.. గుర్రంనీల్ల గుట్టకాడ.. బొమ్మాజెముడు చెట్టున్నాది.. బొమ్మాజెముడు చెట్టు కింద అమ్మ నొప్పులుపడుతున్నాది. . ఎండలేదు.. రాత్రి కాదు ఏగు సుక్క పొడవంగానే పుట్టిందాడ పులిపిల్ల పుట్టిందాడ పులిపిల్ల.
నల్లమల తాలుకాల .. అమ్మపేరు మీరాభాయి.. నాయన పేరు సోమలగండు.. నాయన పేరు సోమలగండు తాత పేరు బహదూరు. ముద్దుల తాత ఏర్య్యా నాయక్ పెట్టిన పేరు భీమ్లా నాయక్’ అంటూ పాట సాగిపోయింది. ఆ పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా సాహిత్యం ఉంది. పవర్ స్టార్ అభిమానులను అలరించే పదజాలంతో పాట సాగిపోతుంది. భీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు, అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో పాట ద్వారానే చెప్పే ప్రయత్నం చేశారు.
Must Read ;- పవర్ స్టార్ అభిమానులకు బండ్ల గణేష్ ట్రీట్











