తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత హోదాలో ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. సీఎం హోదాలో తన టూర్ ను గ్రాండ్ సక్సెస్ గా ముగించారు. అంత ఈజీగా దొరకని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల అపాయింట్ మెంట్లను చిటికెలో సాధించిన కేసీఆర్.. సోమవారం ఒకే రోజు ఏకంగా ఇద్దరు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్ లతో భేటీ అయ్యారు. అంటే.. ఒకే పర్యటనలో ప్రధానితో పాటు ముగ్గురు కీలక శాఖల కేంద్ర మంత్రులతో భేటీలు అయ్యారంటే.. కేసీఆర్ టూర్ గ్రాండ్ సక్సెస్ అయినట్టే కదా. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఇతర రాష్ట్రాల సీఎంలకు అంత ఈజీగా అపాయింట్ మెంట్లు ఇవ్వని మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్లను అసలు ముందస్తు ప్లానింగ్ లేకుండానే కేసీఆర్ సాధించారంటే.. ఆయన పర్యటన గ్రాండ్ సక్సెస్ అయినట్టే కదా.
ఏపీపై షెకావత్ కు ఫిర్యాదు..
అప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో రెండు వరుస రోజుల్లోనే భేటీ వేసిన కేసీఆర్.. సోమవారం ఏకంగా ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తొలుత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన కేసీఆర్.. తెలంగాణలోని రోడ్లకు నిధుల విడుదలపై చర్చించారు. ఇన్నర్ రింగ్ రోడ్లను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని విన్నవించారు. ఆ తర్వాత నేరుగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వద్దకు వెళ్లిన కేసీఆర్.. తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల యుద్ధంపై ప్రధానంగా చర్చించారు. గోదావరి, కృష్ణా నది యాజమాన్య బోర్డుల విషయంలో కేంద్రం జారీ చేసిన గెజిట్ ను పునఃపరిశీలించాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఏపీలోని జగన్ సర్కారు పలు అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తోందని, వాటిపై దృష్టి సారించి జగన్ సర్కారు బ్రేకులు వేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న ప్రాజెక్టులను కేంద్ర మంత్రికి తెలిపిన కేసీఆర్.. వాటికి త్వరితగతిన అనుమతులు ఇప్పించాలని కోరారు. మొత్తంగా ఏపీపై ఫిర్యాదు చేసేందుకే కాకుండా తెలంగాణకు న్యాయం జరిగే పలు కీలక అంశాలను కేసీఆర్ ప్రస్తావించారు.
ముందస్తు ప్లానింగ్ లేకుండానే..
వాస్తవానికి కేసీఆర్ తన పార్టీకి సంబంధించిన పనుల కోసమే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలో తమ పార్టీకి కేటాయించిన స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కోసం వెళ్లిన కేసీఆర్.. ఆ పనిని తొలి రోజే పూర్తి చేశారు. ఈ కార్యక్రమం ముగిసే దాకా కేసీఆర్.. కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీని కలిసే విషయాన్నే ఆలోచించలేదు. అయితే తన ఫిక్స్‌డ్ కార్యక్రమం ముగిసిన తర్వాతే మోదీ, కేంద్ర మంత్రులతో భేటీ కోసం తనదైన శైలిలో చక్రం తిప్పిన కేసీఆర్.. తొలి రోజే ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆ మరునాడే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ ఆయన భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల సీఎంలకు అపాయింట్ మెంట్ ఇచ్చే విషయంలో మోదీ కొంత మేర సానుకూలత వ్యక్తం చేస్తున్నా.. కేంద్ర హోం మంత్రి హోదాలో ఉన్న అమిత్ షా మాత్రం అంత ఈజీగానే అపాయింట్ మెంట్లు ఇవ్వడం లేదు. అయితే కేసీఆర్ మాత్రం తనదైన మార్కు వ్యూహంతో మోదీతో భేటీ అయిన మరునాడే అమిత్ షాతోనే భేటీ అయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక సోమవారం నాడు ఒకే రోజు ఏకంగా ఇద్దరు కీలక శాఖల కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ అయ్యారు. వెరసి తన డిల్లీ టూర్ ను గ్రాండ్ సక్సెస్ చేసుకున్నారు.
Must Read ;- జగన్ కంటే కేసీఆరే తోపు