బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు వినగానే దేవదాస్, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా, పద్మావత్ లాంటి సినిమాలే గుర్తుకొస్తాయి. తనకంటూ ప్రత్యేకత ఉన్న ఈ దర్శకుడు నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయడమే విశేషం. ‘హిరామండీ’ పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. సంజయ్ లీలా బన్సాలీకి ఇది 25 వ ప్రాజెక్టు. ఆయన ఏ ప్రాజెక్టు చేపట్టినా ఎంతో తపన పడి చేస్తాడు. అది సినిమాలోనూ ప్రతిఫలిస్తుంది.
అందుకే అభిరుచి ఉన్న మేకర్ గా ఆయన పేరు బాలీవుడ్ లో స్థిరపడిపోయింది. కథల ఎంపికలోనే కథనంలోనూ ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. నెట్ ఫ్లిక్స్ తో ఆయన ఓ పదేళ్ల పాటు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ అగ్రదర్శకుడితో నెట్ ఫ్లిక్స్ ఇలాంటి ఒప్పందం చేసుకుందంటే ఓటీటీ ప్రపంచంలో నెట్ ఫ్లిక్స్ ఎంతటి దూకుడు మీద ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పదేళ్లలో ఈ ఓటీటీ దిగ్గజం కోసం సంజయ్ లీలా బన్సాలీ ఎన్ని ప్రాజెక్టులు అందిస్తారో చూడాలి.
హిరామండీ ప్రత్యేకత ఏమిటి?
సంజయ్ లీలా బన్సాలీ ఎంచుకునే కథ విషయంలోనే ఆ ప్రత్యేకత కనిపిస్తుంది. ఇది పీరియాడిక్ డ్రామా. స్వాతంత్య్రానికి ముందు జరిగే కథతో ఇది రూపొందుతోంది. హిరీమండీ అనే ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉంది. వేశ్యల జీవితాల పరంగా దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. బన్సాలీ కథ కూడా వేశ్యల జీవితాలతో ముడిపడినదే. వేశ్య అంటే ప్రజల్లో చిన్నచూపు ఉన్నా వారు మాత్రం మహారాణిలా జీవితాన్ని అనుభవించారు. ఈ కథలో మూడు తరాల వేశ్యల జీవితాన్ని బన్సాలీ ఆవిష్కరించబోతున్నారని సమాచారం.
దశాబ్దాలుగా వారు హిరామండీలో ఉండి తమ జీవన పోరాటాన్ని ఎలా సాగించారో చూపబోతున్నారు. బన్సాలీకి ఇది ఎంతో ఇష్టమైన ప్రాజెక్టు అట. ఈ కథ మీద 14 ఏళ్లుగా పరిశోధన సాగించారట. ఆయన డ్రీమ్ ప్రాజెక్టు నెట్ ఫ్లిక్స్ తో ముందుకు రాబోతోంది. మరి ఇందులో బన్సాలీ ఇంకా ఏమేం అంశాలను టచ్ బోతున్నారు అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. వేశ్యల జీవితాల్లో చాలా కోణాలు ఉంటాయి. ద్రోహం, మోసం, ప్రేమ, వారసత్వం, రాజకీయాలు.. ఇలా అన్ని పార్శ్వాలనూ స్పృశించే ప్రయత్నాన్ని బన్సాలీ చేయబోతున్నారు.
ఇదో కొత్త జీవితావిష్కరణ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ ప్రాజెక్టు గురించి సంజయ్ లీలా బన్సాలీ అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. మన రాజమౌళి లాగానే షూటింగ్ కు ఎక్కువ సమయాన్ని తీసుకునే అలవాటు బన్సాలీకి ఉంది. అందుకే దీని విడుదల తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తానికి బన్సాలీ సినిమా ప్రయాణం నెట్ ఫ్లిక్స్ తో ముడిపడిపోయింది.
Must Read ;- మనోజ్ అహం బ్రహ్మాస్మి చిత్రంలో బాలీవుడ్ హీరో.?











