విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప చిత్రాన్ని ఒక్క రోజు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇంతకుముందు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదలైంది. ఈ నెల 13న వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా అమెజాన్ ప్రైమ్ అనుమతి తీసుకుని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఒక్క రోజుకు మాత్రమే అనుమతి ఉందని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన అనేక విషయాలపై మాట్లాడారు. నారప్ప సినిమాని థియేటర్లలో విడుదల చేయగా వచ్చిన డబ్బును సామాజిక సేవకు వినియోగించనున్నట్లు ఆయన చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నారప్ప విడుదలవుతుందని చెప్పారు. దృశ్యం 2 ను థియేటర్లలో వేద్దామనుకున్నా అమెజాన్ తో ఉన్న అగ్రిమెంట్ కారణంగా కుదరలేదని చెప్పారు. సురేష్ ప్రొడక్షన్స్ లో కొన్ని వెబ్ సిరీస్, ఓటీటీ చిత్రాలు రానున్నాయని వివరించారు. తన కుమారుడు అభిరామ్ తో సినిమాలు చేసేందుకు చాలా మంది అడుగుతున్నందున ఇప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్ అతనితో సినిమా చేసే ఆలోచన లేదన్నారు. వెంకటేష్ పుట్టిన రోజున ప్రకటించేందుకు కొత్త సినిమాలు లేవన్నారు. సల్మాన్ వెంకటేష్ తో ఓ సినిమా చేస్తున్నాడని, రానా కూడా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడని వివరించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వీరు చేసే సినిమాలకు సంబంధించి జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రకటన ఉండొచ్చన్నారు.
రీరిలీజ్ ట్రెండ్ బాగుంది
ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ బాగుందని, జనం నుంచి వీటికి మంచి ఆదరణ ఉండటం శుభపరిణామమని అన్నారు. పాత సినిమాలను రీమాస్టర్ చేసి మళ్లీ థియేటర్లలో విడుదల చేసినా జనం ఆదరిస్తున్నారని, శంకరాభరణం చిత్రాన్ని మంచి సౌండ్ సిస్టమ్ తో విడుదల చేసినా జనం ఆస్వాదిస్తారని అన్నారు.
సంక్రాంతికి థియేటర్ల సమస్యే ఉండదు
సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల విషయంలో థియేటర్ల సమస్య విషయంలో రకరకాలుగా మాట్లాడుతున్నారని, అసలు ఎన్ని సినిమాలు విడుదలైనా థియేటర్ల సమస్య ఉండదన్నారు. వారసుడు సినిమా విషయమై మాట్లాడుతూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌గా తనకున్న వీలును బట్టి దిల్ రాజు వారసుడు విడుదల చేసుకుంటున్నారని అన్నారు. అనువాద సినిమాల విషయంలో ఇలాంటి సమస్య ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటుందని అన్నారు. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలను తమిళనాడులో ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తే అక్కడి హీరోలు ఫీలయ్యారని, అప్పుడు తెలుగు హీరోలు, నిర్మాతలు మౌనంగానే ఉన్నారని చెప్పారు. భాష ఏదైనా, అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా సక్సెసే మాట్లాడుతుందన్నారు.