మరో నాలుగు రోజుల్లో అవతార్ – ది వే ఆఫ్ వాటర్ చిత్రం మనముందుకు రాబోతోంది. ఇంతకీ అవతార్ సినిమాలో ఏముంది? దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఏం చెప్పదలుచుకున్నాడు? అసలు పండోరా అనే గ్రహం ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవతార్ 2 ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా అవతార్ మొదటి భాగం కథ ఏమిటి? రెండో భాగంలో ఏం చెప్పారు అనే విషయాలను తెలుసుకుందాం. ఇది ఈ కాలం నాటి కథ కాదు. రాబోయే శతాబ్దం నాటి కథను ముందుగా ఊహించి తెరకెక్కించారు. అంటే ఇంకా 125 సంవత్సరాల తర్వత కథ ఇది. ఈ కథ అంతా సౌర కుటుంబంలోని చందమామ లాంటి ‘పండోరా’ అనే చిన్న గ్రహంపై జరుగుతుంది.
అక్కడికి ఎందుకు వెళ్లాలి?
పండోరా ప్రాజెక్ట్ చేపట్టడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. అక్కడ ఓ అద్భుతమైన మహా వృక్షం ఉంది. ఆ చెట్టు కింద అన్‌అబ్ టైనియమ్ అనే ఖనిజం ఉంది. సంపదను సొంతం చేసుకోవాలనేది భూమి మీద ఓ కార్పొరేట్ సంస్థ ఉద్దేశం. భూమ్మీద బొగ్గు నిల్వలు ఏనాడో బూడిదయ్యాయి. చమురు నిక్షేపాలు లేవు. గాలి, నీరు, సౌర వెలుగులు.. లాంటివి ఈ భూమ్మీద ఎంతో శక్తిని ఇస్తున్నా అవి మనుషుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఈ కొత్త ఖనిజాన్ని చేజిక్కించుకుంటే భవిష్యత్తులో ఇంధన సామ్రాజ్యానికి రారాజులవడం ఖాయం. ఆ స్వార్థం నుంచి పుట్టిందే ఈ కథ. పండోరా గ్రహం మీద విలువైన ఖనిజాలు ఉన్నాయని గుర్తిస్తారు. వాటిని మైనింగ్ చేయాలనేది వారి ప్లాన్. కానీ పండోరాలోని నావీ అనే జాతి ప్రజలు మనుషుల ప్రయత్నాలను అడ్డుకుంటారు. ఈ గ్రహం మీద నావీ జాతి ప్రజల రూపురేఖలు విచిత్రంగా ఉంటాయి. మనకన్నా ఎత్తు ఉంటారు. నీలం రంగుతో మెరిసిపోతుంటారు. పొడవైన తోక ఉంటుంది. వారికి తమదైన సొంత తెలివితేటలుంటాయి. తమ వారెవరో పరాయి వారెవరో క్షణంలో గుర్తించే తెలివితేటలు ఉంటాయి. శత్రువును ఎదుర్కోవలసి వస్తే ధైర్యంగా ముందడుగు వేస్తారు. ముఖ్యంగా అందరూ ఐక్యంగా ఉంటారు.
పండోరాపైకి ఎలా వెళతారు?
వేరే గ్రహం పైకి మనుషులు వెళ్లడం సాధ్యమేనా? మరి ఇందులో ఎలా వెళ్లారు అన్నది కీలకం. కాంతి వేగంతో ప్రయాణించే రోదసీ వాహనాన్ని మనిషి తయారుచేస్తే పండోరాపైకి చేరడానికి ఆరేళ్లు పడుతుంది. ఈ ఆరేళ్లలో అందులో ప్రయాణించేవారి వయసు పెరగకుండా శరీర సహజ ధర్మం మారకుండా జీవవ్యాపారాన్ని స్తంభింపజేస్తారు. గమ్యం చేరిన తర్వాత మళ్లీ వారి శరీర జీవవ్యాపారం పునరుత్తేజం పొందేటట్టు చేస్తారు. ఇది సాధ్యమేనని కూడా మన శాస్త్రవేత్తలు అంటున్నారు. అలా పంపే టీమ్ లో మన హీరో జాక్ ఉంటాడు. అతడు నావికా దళ ఉద్యోగి. మన భూమ్మీద నుంచి మనుషులు అక్కడికి వెళితే శ్వాస తీసుకోలేరు. జాక్ కి నడుం కింది భాగం చచ్చుపడిపోయి ఉంటుంది. పండోరా మీదికి వెళితే తను తిరిగి కోలుకుంటానని నమ్మకంతో అందుకు సిద్ధపడతాడు. అయితే అక్కడికి ఎవరు వెళ్లినా ఆ పండోరా జాతి మనుషులుగా మారిపోవాల్సిందే. అలా జాక్ కూడా వారి రూపంలోకి మారిపోతాడు.
ఒకవిధంగా ఇది పరకాయ ప్రవేశం లాంటిది. జాక్ అవతారం అలా మారిపోతుంది. వెళ్లిన వారి మెదళ్ళను భూమి నుంచే నియంత్రిస్తుంటారు. అతనికి తెలియని మర్మం ఈ ప్రయాణంలో ఉంటుంది. పాండోరా గ్రహంపై ఉండే విలువైన సంపదని దోచుకోవాలనేది ఈ ప్రాజెక్టు ఆర్గనైజర్ ఆలోచన జాక్ కు తెలియదు. అక్కడికి వెళ్లాక అక్కడ శ్వాస పీల్చలేడు కాబట్టి కృత్రిమ పద్దతులతో అతన్ని నావీగా మార్చేస్తారు. నావీ గా మారిన జాక్ అక్కడ తప్పిపోతాడు. క్రూర మృగాల బారిన పడబోతాడు. ఆ సమయంలో అతన్ని నేత్రి అనే ఆడ నావీ కాపాడుతుంది. ఆ తర్వాత జాక్ అక్కడ వారి నిజాయితీకి, ప్రకృతిలో వారి జీవన విధానానికి ముగ్దుడై నేత్రితో ప్రేమలో పడతాడు. అవతార్ మొదటి భాగమంతా జేక్, నేత్రి కుటుంబం చుట్టూ కథ సాగుతుంది. చివరికి ఆమె కోసం, వారి ప్రపంచాన్ని కాపాడేందుకు పోరాడతాడు. రెండో భాగంలో వీరికి ఓ కుటుంబం ఏర్పడుతుంది. ఈ రెండో భాగంలో వీరు పెంచుకున్న టీనేజ్ బిడ్డ కిరీ కూడా ఓ కీలక పాత్ర పోషించనుంది. ఓవరాల్ గా చెప్పాలంటే భూమ్మీద నుంచి వచ్చిన స్వార్థపూరిత మనుషులకూ, పండోరా జాతికీ మధ్య సాగే పోరాటమిది. ఈ పోరాటం రెండో భాగమంతా నీటిలోనే ఉంటుందని మనం ఊహించుకోవచ్చు.