నిర్మాత బండ్ల గణేశ్ నోటి నుంచి ఏ మాటొచ్చినా జనానికే కాదు ఆయన వేదిక మీదుంటే నటులకు కూడా నవ్వాగదు. బండ్ల మాటల్లో భజన మోతాదు ఎక్కువగా ఉందని వారు భావించడమే దీనికి కారణం. మరి ఆ విషయం బండ్ల గణేశ్ కు తెలుసో లేదో మనకు తెలియదు. తాజాగా బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ చూస్తే వవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనతో ఇంకో సినిమా చేయడానికి మాటిచ్చాడన్నట్లుగానే ఉంది. పైగా ఆ ట్వీట్ చేసిన విధానం చూస్తే దేవుడు వరమిచ్చాడు.. బండ్ల పాటిస్తాడు అనేలా ఉంది. ‘నా బాస్ ఓకే అన్నారు.. నా కల నిజమవబోతోంది’ అని ట్వీట్ చేయడం కాస్తా వైరల్ అయ్యింది. దానికి మళ్లీ థాంక్ గాడ్ అనే జోడింపు ఇంకోటి.
అతిగా స్పందించడం బండ్ల గణేశ్ నైజం.. దానివల్ల ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్బాలు ఎన్నో ఉన్నాయి. అలా నోరు జారి బ్లేడ్ గణేశ్ గా మారిన సంగతి తెలిసిందే. చివరికి అలాంటి పాత్రను సినిమాలోనే చేయాల్సి వచ్చింది. ఇంతకీ పవన్ ఆయనకు ఏమని మాటిచ్చారో తెలియదు. ఇప్పటికే పవన్ చేతి నిండా సినిమాలున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి సినిమాల్లోకి వచ్చాక చేసిన సినిమి ‘వకీల్ సాబ్’ ఇంకా అలానే ఉంది. నిర్మాత ఏఎం రత్నానికి మాటిచ్చి ఎంతకాలమైందో మనకు తెలుసు. ఆ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. పవన్ మాటివ్వడం వెనక కొంత మొహమాటం కూడా ఉండి ఉంటుంది.
పైగా బండ్ల వ్యవహరించే తీరుకు ఎవరైనా ఇట్టే మాటిచ్చేస్తారు. అది పట్టాలెక్కినపుడు కూడా మాట్లాడుకోవాలి. ఒకవేళ బండ్ల గణేశ్ కు పవన్ మాటిచ్చినా దాన్ని నిలుపుకోడానికి ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు. అప్పటికి 2024 ఎన్నికలు కూడా రావచ్చు. మరో విషయం ఏమిటంటే తన దగ్గరకు వచ్చిన వారందరికీ పవన్ ఇలా మాటిచ్చేయడం కూడా మంచిది కాదు. మాట ఇచ్చి నిలుపుకోలేదన్న మాట కూడా వస్తుంది. సాధ్యాసాధ్యాలు పరిశీలించి హామీలిస్తే మంచిది. ఓ పక్క మైత్రీ మూవీస్ కి హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది.
జనసేనకు సేవలందించిన రామ్ తాళ్లూరి కోసం సురేందర్ రెడ్డి లైన్ లో ఉన్నాడు. ఇవన్నీ అలా ఉంచితే మలయాళం బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ పవన్ చేస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. అయితే పవన్ కు బండ్ల గణేశ్ తో మంచి అనుబంధమే ఉంది. ఇంతకుముందు గబ్బర్ సింగ్, తీన్ మార్ కూడా బండ్ల నిర్మించారు కాబట్టి మరోసారి అవకాశం ఇద్దామన్న ఆలోచన పవన్ కు వచ్చిందేమో. ఇప్పుడున్న కరోనా సమయంలో షూటంగ్ కు వెళ్లడానికి హీరోలు వెనకాముందు ఆడుతున్న వేళ ఇవన్నీ పూర్తయ్యేదెప్పుడో, కొత్త సినిమాలు చేసే దెప్పుడో పవన్ కే తెలియాలి. ఈ కరోనా కాలంలో కాలక్షేపానికి మాత్రం ఇలాంటి వార్తలు బాగానే ఉంటాయి.











