విదేశాల్లో షూటింగ్స్.. మేకర్స్ కు పెద్ద తలనొప్పి వ్యవహారం. సినిమా యూనిట్ ను అక్కడికి తరలించాలంటే.. నిర్మాతలకు ఖర్చు తడిసి మోపెడతుంది. ఒకోసారి వీసా సమస్యలు తలెత్తుతాయి. మరోసారి పాస్ పోర్ట్ ప్రొబ్లెమ్ ఎదురవుతుంది. ఇంకో సారి అన్నీ రెడీ చేసుకున్నప్పటికీ.. ఏవో కారణాలతో అనుమతి లభించదు. అందుకే స్వదేశాన్నే విదేశంగా మార్చేస్తే ఏ గొడవా ఉండదని చాలా నిర్మాతలు భావిస్తారు. ఆ క్రమంలో హైద్రాబాద్ లోనే ఫారిన్ లొకేషన్స్ వెలుస్తాయి. ఈ నేపథ్యంలో నితిన్ హీరోగా నటిస్తోన్న ‘రంగ్ దే’ సినిమా కోసం అమెరికాలోని ఒక ఇంటి సెట్ ను హైద్రాబాద్ లో నిర్మించడం ఆసక్తిని రేపుతోంది.
నితిన్, కీర్తి సురేష్ జంటగా.. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రంగ్ దే’. కథను బట్టి.. హీరో, హీరోయిన్స్ కాంబినేషన్ సీన్స్ ఎక్కువగా అమెరికాలోని ఒక ఇంట్లో షూటింగ్ చేయాల్సి ఉందట. అయితే ఆ షెడ్యూల్ కాస్త పెద్దది కావడంతో యూనిట్ అక్కడ చాలా రోజులు స్టే చేయాల్సి ఉందట. అది నిర్మాతలకు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందులోనూ ఈ సమయంలో యూనిట్ సభ్యుల్ని అక్కడికి తరలించడం అంటే.. నిర్మాతలకు మరింత భారంగా మారుతుంది. అందుకే ..అమెరికా వెళ్ళకుండానే.. హైద్రాబాద్ లో ఆ ఇంటికి సంబంధించిన సెట్ ను వేసి.. దాన్నే అమెరికా గా భ్రమింపచేయడం బెటరని దర్శక నిర్మాతలకు అనిపించిందట. అనుకోవడమే తరువాయి.. ఒక ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ చేత ఆ ఇంటి సెట్ ను నిర్మింపచేశారట.
కీలక సన్నివేశాలు ఎక్కువగా ఆ ఇంట్లోనే జరగనుండడంతో… ఈ సెట్ కు దాదాపు కోటిన్నర ఖర్చైందట. అమెరికా వెళితే అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే.. నిర్మాతకు ఇది పెద్ద ఖర్చే కాదని .. చాలా డబ్బు సేవ్ అవుతుందని చెప్పుకుంటున్నారు. ఇటీవలే హైద్రాబాద్ లో రంగ్ దే షూటింగ్ ను పున: ప్రారంభించారు. వచ్చేనెల్లో యూరప్ లో రెండు పాట చిత్రీకరణ జరపబోతున్నారట. ‘భీష్మ’ బ్లాక్ బస్టర్ తో ఉత్సాహం గా ఉన్న నితిన్ ఈ సినిమా మీద కూడా మంచి హోప్స్ తో ఉన్నాడట. అలాగే.. కీర్తి సురేష్ కెరీర్ కి సైతం ఈ సినిమా సక్సెస్ కీలకం కానుంది. మరి ‘రంగ్ దే’ ఇద్దరికీ ఏ స్థాయి సక్సెస్ ఇస్తుందో చూడాలి.











