ఇటీవల కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించి విఫలం చెందిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా ? దేశంలో పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటాలని చూస్తున్నారా ? అందుకోసం సొంత కుంపటి పెట్టాలనే నిర్ణయానికి వచ్చారా ? తన రాజకీయ ఎదుగుదల కోసం పీకే రచించుకుంటున్న వ్యూహాలు ఏమిటి ?
కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాన్ని ఆశించి ఆ పార్టీలో చేరిక దాదాపు ఖరారు చేసుకున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త పీకే ఆఖరి నిమిషంలో తన నిర్ణయం మార్చుకున్నాడు. కాంగ్రెస్ కి నో చెప్పి అప్పటివరకు జరుగుతున్న చర్చకు ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టాడు. అయితే కాంగ్రెస్ లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పీకే ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇంతకాలం రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే ఆ బాధ్యతల నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారని టాక్. అందులో భాగంగా కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారట. జాతీయ స్థాయి రాజకీయాల్లో సత్తా చాటాలంటే ఒంటరిగా కష్టం అని గుర్తించిన పీకే, తనతో కలిసి రావాలంటూ పలు రాజకీయ పార్టీలతో చర్చలు కూడా జరిపారట. ఇక తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశాంత్ కిషోర్ ఈరోజే కీలక ప్రకటన కూడా చేయబోతున్నారంటూ పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
కాగా, కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాన్ని ఆశించిన పీకే, ఆ పార్టీలో చేరేందుకు ఇటీవల తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీని ప్రక్షాళన చేయాలంటూ కాంగ్రెస్ అధిష్టానానికి కొన్ని సూచనలు కూడా చేశారు.అయితే, పార్టీలోకి ఆయన రాకను కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు వ్యతిరేకించారు.కానీ పీకే చేరిక పై ప్రత్యేక కమిటీ వేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనీ గాంధీ పీకేకు ఎన్నికల వ్యూహరచన కమిటీలో సభ్యుడిగా స్థానం కల్పిస్తానని చెప్పారు. దీంతో అసంతృప్తి చెందిన పీకే మనసు మార్చుకున్న కాంగ్రెస్‌లో చేరబోవడం లేదని ప్రకటించారు. ఇది జరిగి రోజులు గడవకముందే పీకే సొంత పార్టీ ప్రకటించబోతున్నారంటూ వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇక ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ దేశంలోని వివిధ పార్టీలకు పనిచేస్తుండడం, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పీకే ఇటీవల జరిపిన చర్చలు అనంతరం కాంగ్రెస్ లో చేరికను ఆయన వద్దనుకోవడం చూస్తుంటే పీకే , కెసిఆర్ కలయికలో జాతీయ స్థాయిలో కొత్తరాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.