ఒకప్పటి హిట్ పెయిర్ మళ్ళీ జతకట్టబోతున్నారా ? హీరో హీరోయిన్ లుగా వెండితెరపై అలరించిన ఆ జంట ఇప్పుడు కొత్తగా కనిపించబోతున్నారా ? ఇంతకీ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన ఆ జోడీ ఏది ? సెకండ్ ఇన్నింగ్స్ లో వారిద్దరూ ఏం చేయబోతున్నారు ?
మెగాస్టార్ చిరంజీవి, రాధిక ఒకప్పటికి హిట్ జోడీ. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అనేక చిత్రాలు బాక్స్ ఆఫీసు రికార్డులు సొంతం చేసుకున్నాయి.హీరో హీరోయిన్ లుగానే కాదు, ఏ పాత్ర అయినా ఇద్దరూ కలిసి చేసిన ప్రతీ మూవీలో పోటాపోటీగా నటించేవారు. అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ జోడీ కలిసి మూవీ చేయబోతున్నారట. అయితే హీరో హీరోయిన్ లుగా కాదు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మెరిసిన రాధిక తర్వాతి కాలంలో మంచి క్యారెక్టర్ లలో నటిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా రాడాన్ మీడియా వర్క్స్ పేరిట సొంత నిర్మాణ సంస్థను కూడా స్థాపించిన ఆమె ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు సీరియల్స్ తో రాధిక తన కెరీర్ ని ఇండస్ట్రిలోనే కొనసాగిస్తున్నారు.
కాగా చిరంజీవి, రాధిక కాంబోలో మరో చిత్రం తెరకెక్కనుందనే చర్చ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి హీరోగా నటించే కొత్త చిత్రానికి రాధిక నిర్మాతగా వ్యవహరించనున్నారు. రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్లో తెలుగులో తీయబోయే చిత్రంలో చిరు హీరోగా నటిస్తున్నారట. ఈ విషయాన్ని రాధిక స్వయంగా ప్రకటించారు. తమ చిత్రానికి ఓకే చెప్పినందుకు చిరంజీవికి కృతజ్ఞతలు అంటూ ఆమె ట్వీట్ చేశారు.ఇదిలా ఉంటే త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. మరి ఈ హిట్ జోడీ కలయికలో రాబోతున్న మూవీ ఎలా ఉండబోతోందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..