రవితేజ ఇప్పుడు మంచి జోరుమీదున్నాడు. ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. రవితేజలో ఎనర్జీ లెవెల్స్ ఎంతమాత్రం తగ్గలేదనీ, అభిమానుల్లో ఆయనకి గల క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదని ‘క్రాక్’ సినిమా నిరూపించడమే అందుకు కారణం. అలాంటి రవితేజ .. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రాశి ఖన్నాను తీసుకున్నారనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
రవితేజ – రాశి ఖన్నా గతంలో ‘బెంగాల్ టైగర్’ అనే సినిమా చేశారు. రొమాంటిక్ టచ్ తో కూడిన ఈ యాక్షన్ సినిమాలో రాశి ఖన్నా గ్లామర్ కి మంచి మార్కులు పడిపోయాయి. ఈ సినిమా కమర్షియల్ హిట్ గా భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత ఈ మధ్య రవితేజతో కలిసి ఆమె మరో సినిమా కూడా చేసింది .. ఆ సినిమాపేరే ‘టచ్ చేసి చూడు’. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతగా ఆడలేదు. అయితే గ్లామర్ పరంగా రాశి ఖన్నాకు మాత్రం ఫుల్ మార్కులు పడిపోయాయి.
మళ్లీ ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి త్రినాథరావు నక్కిన సినిమాలో చేయనున్నారని తెలుస్తోంది. రవితేజ జోడీగా ఆమె ఎంపిక జరిగిపోయిందని అంటున్నారు. ముచ్చటగా మూడోసారి చేస్తున్న ఈ సినిమా, సెట్స్ పైకి వెళ్లడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘ఖిలాడి’ సినిమా షూటింగు పూర్తికావలసి ఉంటుంది. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. రవితేజతో తినాథరావు నక్కిన చేయనున్న సినిమా కూడా, యూత్ కీ .. మాస్ ఆడియన్స్ కి నచ్చే కథాంశంతో రూపొందనునట్టు తెలుస్తోంది.
Must Read ;- రవితేజ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ సెట్ అయ్యిందా.?