విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వారం రోజులుగా నిరాహార దీక్ష చేసిన టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాస్‌ను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం జరిగిన సభలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విశాఖ ఆత్మగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నాడని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖ ఆత్మను కూడా జగన్ అమ్ముకోవాలని చూస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంటును అమ్ముతుంటే జగన్ పబ్ జీ ఆడుకుంటున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను ప్రజలంతా వ్యతిరేకించడంతో జగన్ తేలుకుట్టిన దొంగమాదిరి విశాఖ స్టీల్ గురించి ఒక్కమాట మాట్లాడటం లేదని చంద్రబాబు విమర్శిరంచారు.
ప్లాంటు భూములు కాజేసేందుకు ఏ1, ఏ2 స్కెచ్
విశాఖలో స్టీల్ ప్లాంటు భూములు కాజేసేందుకు ఏ1, ఏ2 ఇద్దరూ స్కెచ్ వేశారని చంద్రబాబునాయుడు విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో విశాఖకు ఏం చేశారని, గడ్డి పీకారా, ఇంకేమైనా పీకారా… అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏ2 అటూ , ఇటూ పిచ్చికుక్కలా తిరగడం తప్ప విశాఖకు చేసిందేమీ లేదన్నారు. ఏ2కి కర్మాగారానికి, కారాగారానికి కూడా తేడా తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ అమ్మితే విజయసాయిరెడ్డి అంతు చూస్తా, బట్టలూడదీయిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. పోస్కో ప్రతినిధులు మూడు సార్లు విశాఖ వచ్చి స్టీల్ ప్లాంటులో రెక్కీ నిర్వహించారా లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. దీనిపై ఏ2 సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్రైవేటు వారికి అప్పగిస్తే తిరగబడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Must Read ;- ఇక్కడా, అక్కడా బలైయింది రైతులే.. విశాఖ ఉక్కు బాధితులకు అమరావతి రైతుల సంఘీభావం