రవితేజ తెరపైన ఎంత యాక్టివ్ గా ఉంటాడో .. బయట కూడా అంతే యాక్టివ్ గా ఉంటాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ చూసినవాళ్లు ఆయన ఏ విషయాన్నీ పెద్ద సీరియస్ గా తీసుకోడేమో అనుకుంటారు. అలా అనుకున్నవాళ్ల తెలివితేటలను కొంచెం సందేహించవలసిందే. ఎందుకంటే రవితేజ తన కెరియర్ కి సంబంధించిన విషయాల్లో చాలా సీరియస్ గా .. సిన్సియర్ గా ఉంటాడు. ఒకసారి కమిట్ అయితే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ ఆయన వైపు నుంచి ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాడు. డేట్ .. టైమ్ రెండూ తప్పనివ్వడు.
అలాగే పారితోషికం వసూలు చేసే విషయంలోను ఆయన అంతే కచ్చితంగా వ్యవహరిస్తాడు. వరుస పరాజయాలతో ఆయన సతమతమవుతున్నప్పుడు కూడా పారితోషికం తగ్గించడానికి ఆయన ఒప్పుకోలేదనే వార్తలు ఆ మధ్య బాగానే షికారు చేశాయి. ఆ సమయంలో కొంతమంది నిర్మాతలు ఆయన పారితోషికాన్ని తగ్గించడానికి గట్టిగానే ప్రయత్నించారుగాని కుదరలేదు. అవసరమైతే ప్రాజెక్టులను వదులుకున్నాడేగాని పారితోషికం విషయంలో మాత్రం పట్టువీడలేదని అంటారు. తీసుకున్న చివరి రూపాయి వరకూ కష్టపడతాడనీ, అనుకున్న అవుట్ పుట్ ఇస్తాడనే మంచి పేరు కూడా ఉంది.
అలాంటి రవితేజ పారితోషికం మళ్లీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ‘క్రాక్’ సినిమా హిట్ తరువాత ఆయన పారితోషికం పెరిగిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. రవితేజ హీరోగా సంక్రాంతి బరిలోకి దిగిన ‘క్రాక్‘ .. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 50 శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. థియేటర్లు పెంచుతూ వెళుతుండటాన్ని బట్టి, ఈ సినిమా ఏ రేంజ్ హిట్టో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి ముందు 10 నుంచి 12 కోట్ల పారితోషికం తీసుకుంటూ వచ్చిన రవితేజ, ఇప్పుడు 15 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది ఇచ్చుకునేవారికీ .. పుచ్చుకునేవారికే తెలియాలి మరి.
Must Read ;- ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆహా అనిపించనున్న క్రాక్