టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా కుప్పం చేరుకున్న చంద్రబాబు కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభతో తన పర్యటనను ప్రారంభించారు. రెండు రోజుల పాటు కుప్పంలోనే ఉండనున్న చంద్రబాబు.. శనివారం కూడా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. కుప్పంలో తన పర్యటనను ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎక్కడికెళ్లి చర్చిద్దాం?
ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే.. ‘‘ఎన్నో ఏళ్లుగా నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఇటీవల ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలిత ఉగ్రవాదం ఉందని తెలియజేశాను. నేను చేసేది ధర్మపోరాటం. ధర్మాన్ని కాపాడడం బాధ్యతగా భావిస్తాను. చోటా మోటా నాయకులు వస్తేనే లెక్కకుమిక్కిలిగా పోలీసులు వస్తారు. ఇవాళ నా సభలో ముగ్గురు పోలీసులే ఉన్నారు. ఏవండీ ఎస్సై గారూ.. ఎందుకండీ మీరు కూడా ఇక్కడ? మీ డీజీపీ ఏమో మా ఆఫీసుపై దాడి జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటారు. డీజీపీ ఆఫీసుకు దగ్గర్లోనే టీడీపీ ఆఫీసు ఉన్నా, టీడీపీ ఆఫీసుపై దాడి జరిగినా పట్టించుకోలేదు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసి టీడీపీ వారిపైనే కేసులు పెడుతున్నారు. ఇక్కడేమో ఒకాయన నాపై బాంబు వేస్తానంటున్నాడు. అలిపిరిలో నాపై 24 క్లెమోర్ బాంబులు పేల్చారు. సాక్షాత్తు వెంకటేశ్వరస్వామే కాపాడాడు నన్ను. ఇవాళ ధర్మం కోసం పోరాడే నన్ను ఈ ప్రజాదేవుళ్లే కాపాడుకుంటారు. నా పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. నేను రాష్ట్రంలో తిరగకూడదా? నేను చేసిన తప్పేంటి? ఏమడిగాను నేను? రాష్ట్రంలో గంజాయి పండిస్తున్నారు.. చర్యలు తీసుకోమని అడిగాను. గంజాయి తీసుకుంటే పిల్లలు ఏమవుతారు? ఆ మాట అడిగితే సమాధానం చెప్పరు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతున్నారు. తయారీ అంతా జగన్ దే. రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగిపోయాయి. చమురు ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. నాకు సభ్యత, సంస్కారం ఉంది. ఏనాడైనా నా నోట్లోంచి బూతులు వచ్చాయా? కానీ రెండున్నరేళ్ల నుంచి మమ్మల్ని బూతులు తిడుతున్నారు. ఇక్కడ పెద్దిరెడ్డి పెద్ద పుడింగి అట. ఆకాశం నుంచి ఊడిపడ్డాడట. అలాంటి వ్యక్తిని ఏమైనా మాట్లాడితే ఒకాయన భరించలేడట.. నాపై బాంబు వేస్తాడట. నేను రెడీగా ఉన్నా. రెండున్నరేళ్ల నుంచి మీరు మాట్లాడిన మాటలు, మేం మాట్లాడిన మాటలు ప్రజలు ముందు ఉంచుదాం. ప్రజలు నాది తప్పని తేల్చితే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధం. మరి మీ సంగతేంటి మిస్టర్ జగన్.. ఎక్కడికి వస్తావు.. కుప్పం వస్తావా, పులివెందుల వస్తావా, అమరావతి వస్తావా, విశాఖ వస్తావా, తిరుపతి పవిత్ర దేవాలయానికి వస్తావా, లేకపోతే మీ పవిత్ర జెరూసలేంకు వస్తావా..? ఏం మీరు అంటే మేం పడాలా? మీ గురించి మాట్లాడితే మా ఆఫీసులపై దాడి చేస్తారా? పోలీసులు కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారు. నీ కేసులకు భయపడి మేం నీకు దాసోహం అనాలా? నీకు భయపడి మేం పారిపోవాలా? ఒక్క చాన్స్ అంటూ అడిగితే అవకాశం ఇచ్చారు.. కానీ దద్దమ్మ ప్రభుత్వం వచ్చింది” అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు.
కలకలం రేపిన వైసీపీ కార్యకర్త
ఇదిలా ఉంటే.. చంద్రబాబు కుప్పం సభకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. టీడీపీ శ్రేణులతో పాటు సామాన్య జనం కూడా చంద్రబాబు సభకు పోటెత్తారు. భారీ జన సందోహాన్ని చూసి సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా సభలో కలకలం రేగింది. వైసీపీకి చెందిన ఓ కార్యకర్త జన సమూహంలోకి వచ్చారు. తన వద్ద బాంబులున్నాయంటూ జేబుల్లోని రాళ్లను చూపిస్తూ భయపెట్టాడు. దీంతో ఒక్కసారిగా సభలో కలకలం రేగింది. అయితే ఇలాంటి పరిణామాలను ముంచే పసిగట్టిన చంద్రబాబు.. పార్టీ శ్రేణులను సంయమనంతో ఉండమని ఆదేశించడంతో పాటుగా సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని సూచించారు. అయినప్పటికీ కలకలం తగ్గకపోవడంతో ఒకింత భయాందోళన వాతావరణం అయితే నెలకొంది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన చంద్రబాబుకు ఆయన భద్రతా సిబ్బంది భద్రతా వలయంగా మారారు. అయితే జనంలో దూరిన వ్యక్తి జేబుల్లో ఉన్నవి రాళ్లని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.