దేశంలో అన్ని రాష్ట్రాలకు ధీటుగా ఏపీ బాగుండాలని, అందులో భావితరాలకు గుర్తుండిపోయే విధంగా రాజధాని నిర్మాణానికి భూములిచ్చారు అక్కడి రైతులు. ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు ఎదుట ఆనాడు అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి నేను, నా పార్టీ అనుకూలమేనని జగన్ ఒప్పుకున్నారు. కాకుంటే ఇంకొన్ని వేల ఎకరాలు తీసుకుంటే చాలా బాగుండేదేమో అని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. పండించిన సీన్ కట్ చేస్తే అది 2019 డిసెంబర్ 17 .. మూడు రాజధానులతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేశారు. కర్నూలు, విశాఖలకు ప్రయారిటీ ఇచ్చారు. జగన్ ప్రకటించిన ఆ రెండు రాజధానుల్లో రెండేళ్లు కావస్తున్న ప్రభుత్వ కార్యకలాపాలు ఏం జరుగుతున్నాయో నేటికీ చిదంబర రహస్యమే. వారసత్వ రాజధానిగా భాసిల్లిన రాజధాని అమరావతిలో చంద్రబాబు అప్పట్లోనే 10 వేలు కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేపట్టారు. నూతన రాజధాని నిర్మాణాలు, అభివృద్ధి రెండు చంద్రబాబు హాయంలో పరుగులు పెట్టాయి. ఆర్థిక లోటు ఒకపక్క వెంటాడుతున్నా, కేంద్రం సహకరించకపోయినా.. రాజధానిలో నిర్మాణానికి పోషించాల్సిన పాత్రలన్నీ పోషించారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే .. ఆయన ఆడిన మూడు ముక్కలాటలో రైతులు చిత్తుగా మోసపోయి, రోడ్డున పడ్డారు. డిసెంబర్ 17, 2019 నుంచి నేటి వరకు ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటూ నిరంతరం వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తూ.. ఆందోళన బాట పట్టారు. కనికరం లేకపోయినా పర్వాలేదు కానీ, కనీస చలనం లేకుండా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఆగ్రహం తెప్పిస్తోందని జేఏసీ నాయకులు, రైతు నాయకులు వాపోతున్నారు. రాజధానిలో రైతులు చేస్తున్న ఉద్యమం వారి ఒక్కరి సమస్యే కాదు.. అది ఏపీ కలల రాజధాని కాంక్షించే ప్రజలందరిదీ కూడా. 681 రోజుల నుంచి రాజధాని అమరావతిని ఇక్కడ నుంచి తరలించవద్దని రైతులు నిరసనలు చేస్తుంటే రాష్ట్రంవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నేటికి తమ మద్దుతును తెలుపుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే నెల 1 నుంచి తుళ్లూరు నుంచి ‘న్యాయస్థానం టూ దేవస్ధానం’ పేరుతో మహాపాదయాత్రకు రైతులు శ్రీకారం చుట్టారు. కానీ ఏపీ ప్రభుత్వం ఈ పాదయాత్రకు అనుతివ్వలేదని, డీజీపీ గౌతం సవాంగ్ తో చెప్పిందని అమరావతి జేఎసీ, రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి.
మీ పాదయాత్రకు అనుతులివ్వలేదా?
ఒక రాజకీయ పార్టీ తన వ్యక్తిగత ఉద్దేశాలతో స్వాప్రయోజనాలు ఆశించి తలపెట్టిన పాదయాత్ర కాదు ఇది. ఇది ఏపీ రాజధానికి సర్వం సమర్పించిన ఓ బాధిత రైతు వేదన నుంచి పుట్టుకొచ్చిన పాతయాత్ర అని గ్రహించాల్సి ఉంది. అంతేకానీ రాజకీయ ప్రయోజనాల కోసమో, మోసపూరిత హామీలు తలపెట్టిన పాదయాత్ర కాదు అని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే సమయం నవంబర్ 4న ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు హయంలో నేటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తలపెట్టిన పాదయాత్రకు డీజీపీ సాంబశివరావు అనుమతివ్వలేదా? మరి రాజధాని రైతు తన ఆక్రందనలను దేవుడితో చెప్పుకునేందుకు తలపెట్టిన పాదయాత్రకు మీరెందుకు అనుమతించరు? అని జేఏసీ నేతలు నిలదీస్తున్నారు. దేవుడి కార్యక్రమం ఎంతో శాంతియుతంగా సాగే పాదయాత్రకు మీకొచ్చిన రాజకీయ అడ్డంకులేమిటో అర్థం కావడం లేదు.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు సాగించిన 341 రోజుల సుదీర్ఘ పాదయాత్రకు అప్పటి డీజీపీ అనుమతిస్తే .. దేవుడి కార్యక్రమం తలపెట్టిన రైతుల పాదయాత్రకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మేధావులు విమర్శిస్తున్నారు. రైతులు తలపెట్టిన ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పేరుతో 45 రోజుల పాటు సాగనున్న ఈ మహాపాదయాత్రకు అనుమతులిచ్చినా.. ఇవ్వకపోయినా పాదయాత్ర చేసే తీరుతామని అమరావతి జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి ప్రకటించారు.
రైతుపాదయాత్రలో పాల్గొంటా: మాజీ జేడీ
రాజధాని అమరావతి పరిరక్షణ కోసం తుళ్లూరులో రైతులు చేస్తున్న ఉద్యమ శిబిరాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సందర్శించారు. 681 రోజులు పాటు సుదీర్ఘంగా ఉద్యమం చేస్తున్న రైతులకు సంఘీభావం తెలియజేశారు. రైతులు భూములిచ్చింది వారి ప్రయోజనాల కోసం కాదని, కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని జేడీ చెప్పారు. మహిళలు రోడ్డు మీద కూర్చుని ఆందోళన చేస్తుంటే మనసు కలిచివేస్తుంది వాపోయారు. మాతృమూర్తులను పోలీసులు కొట్టడం చూసి బాధ, ఆవేదన కలిగిందని రైతులతో పంచుకున్నారు. రైతులు తలపెట్టిన పాదయాత్రలో తాను పాల్గొంటానని ప్రకటించారు. పాదయాత్రకు అడ్డుపడుతున్న శక్తులను న్యాయస్థానంలోనే ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. తనవంతు న్యాయ సహాయం రైతులకు అందిస్తానని హామీ ఇచ్చారు.
హైకోర్టును ఆశ్రయించిన జేఏసీ
ఇదిలా ఉంటే రాజధాని పాదయాత్రకు అనుమతివ్వాలని కోరినా డీజీపీ నుంచి ఎటువంటి స్పందన లభించకపోవడంతో జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు స్పందించిన డీజీపీ అనుమతులను నిరాకరించారు. 47 రోజుల పాటు సాగే పాదయాత్రలో అవాంఛనీయ ఘటనలు,అల్లర్లు జరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని అమరావతి జేఏసీ కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు ఆయన లేఖ రాశారు. గతంలో కూడా రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న బెజవాడ కనదుర్గమ్మకు మొక్కులు చెల్లించేందుకు బయలుదేరిన రైతులపై విచక్షణా రహితంగా లాఠీచార్జీ చేశారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి పోలీసు వ్యాన్ లో పడివేసిన సంఘటనలు రాష్ట్ర ప్రజలకు గుర్తే ఉంది. ఇలా రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షలకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని రైతు సంఘాలు అవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ 681 రోజులు రైతుల దీక్షలో అనేక పర్యాయాలు మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. మహిళా హక్కుల అతిక్రమణలయితే కోకొల్లలు అనే చెప్పాలి. ఏది ఏమైనా రాజధాని రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు అడ్డుపడితే అమరావతి కేంద్రంగా ఏర్పడబోయే అలజడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
షరతులతో కూడిన అనుమతి
ఇదిలా ఉంటే.. రాజధాని రైతుల మహాపాదయాత్రకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. రాజధాని రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా రైతుల మహాపాదయాత్రకు అనుమతులు ఇస్తే నష్టమేమిటని హైకోర్టు జగన్ సర్కారును ప్రశ్నించింది. దీనికి సమాధానంగా రాజధాని రైతుల మహాపాదయాత్రపై గ్రామాల్లో ప్రజలు రాళ్ల దాడి చేసే ప్రమాదం ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాది బదులిచ్చారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శాంతియుతంగా యాత్రను నిర్వహిస్తామని జేఏసీ తరఫు న్యాయవాది చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు రాజధాని రైతుల మహాపాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.