సాలూరి రాజేశ్వరరావు పేరు వినగానే మకరందం కంటే తీయనైన పాటలు మనసు గోడలను పట్టుకుని, అనుభూతుల అగాధంలోకి జారతాయి. ఎన్నో సాంఘిక చిత్రాలకు .. పౌరాణిక .. జానపద .. చారిత్రక చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. ఎన్నో సినిమాలు భారీ విజయాలను అందుకోవడంలో ఆయన సంగీతం ప్రధానమైన పాత్రను పోషించింది. అప్పట్లో అగ్ర దర్శక నిర్మాతలంతా ఆయన పాటల కోసం వెయిట్ చేసేవారు. ఆయన బిజీగా ఉన్నాడని వాళ్లు తొందరపడినా, కథానాయకులు మాత్రం ఆయనతోనే చేయించాలని పట్టుబట్టేవారట. సాలూరి ప్రతిభా పాటవాలపై వాళ్లకి అంతటి నమ్మకం.
అలాంటి సాలూరి రాజేశ్వరరావు గురించి ఆయన కుమారుడు వాసూరావు తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. “మా తాతగారి వాళ్లది విజయనగరం సమీపంలోగల ‘శివరామపురం’ .. వాళ్లది చాలా పేద కుటుంబం .. అప్పట్లో ఇల్లు జరగడమే కష్టంగా ఉండేది. మా నాన్నగారికి చిన్నతనం నుంచే పాటలపై ఆసక్తి ఉండేది. ఆయన గొప్పవాడు అవుతాడని భావించిన ఆ ఊరువాళ్లు, ఆయనను చెన్నై పంపిస్తే బాగుంటుందని భావించారు. తలాకాస్త డబ్బుపోగుచేసి మా తాతగారికి ఇస్తే, ఆయన మా నాన్నగారిని వెంటబెట్టుకుని చెన్నై తీసుకెళ్లారు. అలా చెన్నై చేరుకున్న నాన్నగారు చిత్రపరిశ్రమలో సంగీత దర్శకుడిగా కుదురుకున్నారు.
నాన్నగారికి కాస్త ఆత్మాభిమానం ఎక్కువ .. ఎవరైనా తన మనసుకు కష్టం కలిగిస్తే, వెంటనే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసేవారు. ‘మాయాబజార్’ సినిమా విషయంలోనూ అదే జరిగింది. మా నాన్నగారు 5 పాటలు చేసిన తరువాత, ఒక ట్యూన్ విషయంలో చక్రపాణిగారు అసంతృప్తిని వ్యక్తం చేశారట. అంతే .. మధ్యలోనే తన పనిని ఆపేసి ఆయన వెనక్కి వచ్చేశారు. ఆ తరువాత వాళ్లు మిగతా పాటలు ఘంటసాల గారితో చేయించుకుని ఆయన పేరే వేశారు. అయినా నాన్నగారు ఆ విషయాలను పట్టించుకునేవారు కాదు. అలా ఆయన చేసిన సినిమాల కంటే వదిలేసినా సినిమాలు ఎక్కువ” అని చెప్పుకొచ్చారు.











