పల్నాటి యుద్దం, పుల్లరి పోరాటాలు గుర్తు లేదా మీకు?
‘‘పల్నాడు ప్రజలంటే ఫ్లవర్స్ అనుకుంటివా.. ఫైర్..! ది బిగ్ ఫైర్!!’’ అన్నది జగన్ రెడ్డి ప్రభుత్వం తెలుసుకునే రోజు అతి త్వరలో వస్తుందని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. సోమవారం గురజాల నియోజకవర్గ కేంద్రంలోని చల్లగుండ గార్డెన్స్ లో యరపతినేని నేతృత్వంలో ‘పల్నాడు జిల్లా సాధన ఐక్య సాధన కమిటీ’ అఖిల పక్షం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది! ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి యరపతినేని మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా కేంద్రంగా గురజాలను ప్రకటించకుంటే పల్నాడు ప్రజలు దెబ్బేమిటో రుచి చూపిస్తాం అని హెచ్చరించారు. ఏదో చిన్నచిన్న ఉద్యమాలు చేసి ఊరుకుంటారని అనుకుంటే పొరపాటేనని.. పుల్లరి ఉద్యమ చరిత్ర అద్దె నాయకులు, పెయిడ్ ఆర్టిస్ట్ లకు ఏం తెలుసు అని? ఎద్దేవా చేశారు. ఆవులు మేపుకుంటే పన్ను కట్టాలన్న బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన కన్నెగంటి హనుమంతు పుట్టిన పల్నాడు గడ్డపై ఉద్యమం ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్లి మెడలు వంచాలో ఇక్కడ వారికీ బాగా తెలుసు అని ఆయన అన్నారు. నాయకురాలు నాగమ్మ నేతృత్వంలో మాల కన్నమదాసు సేనాధిపతిగా బ్రహ్మనాయుడు పై యుద్ధం చేసిన గడ్డ నుంచి ఉద్యమాన్ని ఢిల్లీలోని జంతర్ మంతర్ వరకు ఎలా తీసుకెళ్లాలో మేధావులకు, రాజకీయ నాయకులకు తెలుసు అని కూడా గుర్తుచేశారు.
లక్షమందితో పల్నాడులో భారీ సభ..!
గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసే వరకు ఉద్యమం ఎట్టి పరిస్థితిలో ఆగేది లేదని మాజీ యరపతినేని శ్రీనివాసరావు తేల్చి చెప్పారు. భవిష్యత్తులో పల్నాడు ప్రాంతంలోని గ్రామగ్రామానా తిరిగి జన సేకరణ చేసి, లక్షమందితో భారీ సభ నిర్వహించి.. జగన్ రెడ్డి ప్రభుత్వం అవలంబించే ఒంటెద్దు పొకడలను ఎండగడుతామని హెచ్చరించారు. వెనుకబడిన పల్నాడులో అనాదిగా కుంటపడ్డ అభివృద్ధి, యువతకు ఉపాధి లభించాలంటే తప్పనిసరిగా జిల్లా కేంద్రాన్ని గురజాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు ప్రాంతాన్ని ఆనుకుని కృష్ణానది ప్రవహిస్తూ.. అనేక పరిశ్రమలకు జీవనాడిలా ఉందని, విస్తారమైన మౌళిక వసతులతో ఉన్న పల్నాడును జిల్లా కేంద్రంగా ప్రకటించకుంటే పరిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయని యరపతినేని పేర్కొన్నారు. అటువంటి పల్నాడును కాదని, ఈ ప్రాంతానికి సంబంధంలేని నరసరావుపేట లో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సబబుకాదన్నారు. పల్నాడు యుద్దాన్ని తలపించేలా జిల్లా కేంద్రాన్ని సాధించేంత వరకు పోరాటాలు సాగుతాయని, ఇప్పటికైనా జగన్ రెడ్డి ప్రభుత్వం మేల్కొని గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా కేంద్రాన్ని ఏర్నాటు చేయాలని యరపతినేనితో పాటు అఖిలపక్షం నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Must Read:-ప్రజాస్వామ్య మూల స్తంబాలు కుప్పకూలాయి..! ఇక జగన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం?!