ప్రజాస్వామ్య మూల స్తంభాలు కుప్పకూలాయి!
‘‘ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా పిలువబడే లెజిస్లేచర్, బ్యూరోక్రసీ, జ్యూడిషరీ (న్యాయవ్యవస్థ), మీడియా..’’ ఈ నాలుగు వ్యవస్థలు ఒక దానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణకు బాసటగా నిలిస్తాయి. ఇందులో మొదటి రెండు వ్యవస్థల లోపాలని, తప్పు ఒప్పులని ఎత్తి చూపే పని రాజ్యాంగంలో మీడియాకి కల్పించగా.. వాటిని దండించైనా సరే సరిచేసే హక్కు, అధికారం జ్యూడిషరీకి అప్పగించింది భారత రాజ్యాంగం! కానీ ఇందుకు భిన్నంగా ఏపీలో జగన్ రెడ్డి అండ్ కో పాలన సాగిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లోనే మీడియా గొంతుకు ఉరి బిగించారు. అది నేటికి తాడేపల్లి ప్యాలెస్ గుమ్మానికి వేలాడుతూనే ఉంది! సీఎం పర్యటనలో మీడియాపై ఆంక్షలు విధిస్తూ.. గతంలో ఎన్నడూ లేని రూల్స్ ను జర్నలిస్ట్ పై రుద్దారు. జర్నలిస్ట్ ల సంక్షేమం అన్నది ఏనాడో గాలికొదిలేశారు. చివరికి సమాచార శాఖ ద్వారా అందించే అక్రిడేషన్స్ లో కూడా గతంలో ఎన్నడూ లేనంతగా నిబంధనలు పెట్టి.. కోతలు విధించారు. అలానే న్యాయ స్థానాలపై పాకీ ప్రభాకర్ రెడ్డి, మరో కొంతమంది ఫ్యాన్ పార్టీకి చెందిన కార్యకర్తలతో దుష్పచారం చేయించడం, న్యాయ మూర్తులను సోషల్ మీడియాలో బూతులు తిట్టిచడం వంటివి చర్యలు చూసి దేశం నివ్వెరబోయింది. దాదాపు 190 ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేక తీర్పులను ఇచ్చింది ఏపీ హైకోర్టు. అన్ని వ్యతిరేక తీర్పులను మూటకట్టుకున్న సీఎంగా జగన్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతోందన్న విమర్శలు లేకపోలేదు! మరోవైపు బ్యూరోక్రసీ వ్యవస్థ నేడు అవస్థలు పడుతోంది. ఉద్యోగుల సమస్యలు వారంలో తేల్చి, మీకు న్యాయం చేస్తానని జగన్ రెడ్డి ఆనాటి ఎన్నికల హామీ, నేడు ఉద్యోగులను నానా ఇబ్బందులకు గురిచేస్తోంది! ఇస్తున్న ఐఆర్ కన్నా తక్కువ పీఆర్సీని ప్రకటించి, వారి ఆగ్రహానికి గురయ్యాడు. గడిచిన మూడు నెలలుగా ఉద్యోగుల ధిక్కార స్వరం.. జగన్ రెడ్డి ప్రభుత్వానికి నిద్రపట్టనివ్వడంలేదు. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. అంతిమంగా జగన్ రెడ్డి ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు మాట వినేది ఒక్క పోలీసు వ్యవస్థ తప్ప.. ఏ ఒక్క ఉద్యోగి వినే పరిస్థితుల్లో లేరన్నది అక్షర సత్యం!
ప్రజాసేవలు స్తంభించడం ఖాయం..!
ఉద్యోగులు ఉద్యమ బాటపడితే ప్రజాసేవలు స్తంభించడం ఖాయం. ప్రజా అవసరాలు, సౌకర్యాలు, వసతులు, మానవ వనరులు వంటివి పూర్తిగా పడకేస్తాయి. సైన్యంలేని రాజు వలే జగన్ రెడ్డి ప్రభుత్వం ఒంటరిదై పోతుంది. వ్యవస్ధలన్నీ ఒక్కసారిగా కుప్పకూలి, ఎమర్జెన్సీని తలపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో లోటు బడ్జెట్, కరోనా కష్టాలు, అప్పులు వంటి ప్రభుత్వాన్ని సమస్యగా మారిందని ముసలి కన్నీరు కార్చినా .. ఉద్యోగులు వినే పరిస్థితిలో లేదు. వారి డిమాండ్స్ ను నెరవేర్చుకునే వరకు ఉద్యమం నుంచి వెనుదిరిగేది లేదని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు భీష్మించాయి. అంతిమంగా గత్యంతరం లేక ఉద్యోగుల ప్రయోజనం చేకూర్చే నిర్ణయంతో జగన్ రెడ్డి ప్రభుత్వం అడుగు ముందుకెయ్యాల్సిన పరిస్థితి కొనితెచ్చుకున్నాడు. శుక్రవారం ఉద్యోగులు సమ్మె నోటి ఇచ్చేందుకు సీఎస్ ను కలవనున్నారు. అంతకన్నా ముందుగా జగన్ రెడ్డి అత్యవసర మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఉద్యమాలు, ఉద్యోగుల పీఆర్సీ వంటి వాటిపై చర్చించి, జగన్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.