కూటమి సర్కార్ ప్రయత్నాలతో ఉత్తరాంధ్రలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఇప్పుడు కూటమి సర్కార్ ప్రాధాన్యతనిస్తోంది. తాజాగా ఉత్తరాంధ్రకు సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం పనులు చివరిదశకు చేరుకున్నాయి. త్వరలోనే విజయనగరం జిల్లా ప్రపంచ పటంలో స్థానం దక్కించుకోనుంది. మరోవైపు భోగాపురం విమానాశ్రయానికి సమీపంలో పర్యాటక శాఖకు ప్రభుత్వం గతంలో 80 ఎకరాలు కేటాయించింది. ఇందులో 40 ఎకరాలు మై కేర్ సంస్థకు, మరో 40 ఎకరాలు ఒబెరాయ్ సంస్థకు అప్పగించారు.
భోగాపురం – భీమిలి మండలాల మధ్య 5 స్టార్ హోటల్స్ రానున్నాయి. చింతపల్లి తీరంలో గతంలో నిర్మించిన టూరిజం కాటేజీలను ఏపీ స్కూబా డైవింగ్ సంస్థకు కేటాయించారు. నాలుగున్నర ఎకరాల్లోని ఈ కాటేజీల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విమానాశ్రయాన్ని ఆనుకుని GMR సంస్థ రూ.500 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనుంది. సమీపంలో ప్రస్తుతం ఉన్న ప్రైవేటు రిసార్టు యాజమాన్యం రూ.100 కోట్లతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణ పనులు ప్రారంభించింది. సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో విమానాశ్రయానికి సమీపంలోనే కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. జిల్లా సరిహద్దులోని భీమిలి మండల పరిధిలో తాజ్ హోటల్ నిర్మాణానికి యాజమాన్యం ముందుకొచ్చింది.
విమానాశ్రయానికి ఒకవైపు 16వ నంబరు జాతీయ రహదారి..మరోవైపు అందాల సముద్రతీర ప్రాంతం ప్రధాన ఆకర్షణ. ఇక్కడికి ప్రయాణికులు సులువుగా చేరుకునేందుకు VMRDA సహా ప్రభుత్వ శాఖలు 15 అనుసంధాన రోడ్లు నిర్మించనున్నాయి. విశాఖ తీర రహదారిని ఆరు వరుసలుగా విస్తరించనున్నందున ఈ పనులు ప్రారంభమైతే వాటిని ఆనుకొని ఇటు తీరంలో..అటు ఆనందపురం, తగరపువలస మధ్య నాలుగైదు ఫైవ్ స్టార్ హోటళ్లు నిర్మించాలని పారిశ్రామికవేత్తలు యోచిస్తున్నారు. ప్రభుత్వం దగ్గరున్న 500 ఎకరాలను GMR సంస్థకు తాజాగా అప్పగించింది. కొంత విస్తీర్ణంలో దిల్లీలో మాదిరి టౌన్‌షిప్ నిర్మించాలని జీఎంఆర్ యాజమాన్యం నిర్ణయించింది.
ఎయిర్‌పోర్టుకు సమీపంలోనే వంద ఎకరాల్లో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముక్కాం తీరానికి వెళ్లే దారిలో కొంగవానిపాలెం వద్ద పరిశ్రమల శాఖకు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 36 ఎకరాలు కేటాయించింది. ఇందులోMSME పార్కు అభివృద్ధి చేయకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఐతే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 23 ఎకరాల్లో MSME పార్కు అభివృద్ధికి పచ్చజెండా ఊపింది. ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేటింగ్ పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పనున్నారు. మరో 10 ఎకరాల్లో దివీస్ సంస్థ లాజిస్టిక్ హబ్ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
విమానాశ్రయ పరిసర మండలాల్లో ఇప్పటికే భూములు కొనుగోలు చేసిన యజమానులు లేఅవుట్లు వేశారు. భోగాపురం, పూసపాటిరేగ, తగరపువలస, ఆనందపురం, భీమిలి మండలాల్లో టౌన్‌షిప్‌ల నిర్మాణానికి రియల్టర్లు ముందుకొస్తున్నారు. విమానాశ్రయం పనులు పూర్తయ్యే నాటికి వీటిలో కొన్నింటిని పూర్తి చేయాలని యోచిస్తున్నారు.











