ఏపీలో పంటల బీమాలో మరో మోసం వెలుగు చూసింది. సహజంగా రైతులు బ్యాంకులో రుణం తీసుకునేప్పుడు ఏ పంటకు ఎక్కువ రుణం ఇస్తే అదే పంటను బ్యాంకులో నమోదు చేయిస్తారు. రుణం తీసుకున్నాక ఏ పంటకు వాతావరణం అనుకూలిస్తే ఆ పంట సాగు చేస్తూ ఉంటారు. ఇలా చేసినా కూడా గతంలో పంటల బీమా వర్తింప జేశారు. అయితే, 2019 నుంచి బ్యాంకులో రుణం తీసుకునేప్పుడు నమోదు చేసిన పంట, ఈ క్రాపింగ్ చేసినప్పుడు నమోదైన పంట ఒకటి కాదంటూ 48 లక్షల మంది రైతులను పంటల బీమాకు అనర్హులను చేశారు. తాజాగా వైసీపీ ప్రభుత్వం 2019 ఖరీఫ్ కాలానికి పంటల బీమా పరిహారంగా రూ.1200 కోట్లు విడుదల చేయడంతో ఈ దగా వెలుగు చూసింది.
ఎలా బయటపడిందంటే..
2019 పంటల బీమా పరిహారం కొందరు రైతులకు జమ అయింది. మరికొందరు అదే గ్రామ రైతులకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన అనంతపురం జిల్లా రైతులు అధికారులను సంప్రదించారు. మా పక్క రైతు నేను ఒకే పంట వేశాం. పంట నష్టం వాటిల్లింది. అతనికి బీమా పరిహారం అందింది. నాకు రాలేదని అధికారులను నిలదీశారు. దీంతో అసలు వ్యవహారం బయటకు వచ్చింది. బ్యాంకులో రుణాలు తీసుకునేప్పుడు ఎక్కువ రుణం లభించే పంట పేరు బ్యాంకులో నమోదు చేయిస్తున్నారు. బ్యాంకులు రుణాలివ్వడం ప్రారంభించినప్పటి నుంచీ ఈ తంతు జరుగుతూనే ఉంది. ఇక పంటల బీమా వచ్చి కూడా రెండు దశాబ్ధాలు అయింది. కానీ ఎవరూ అభ్యంతరం పెట్టలేదు. పొలంలో ఏ పంటకు నష్టం జరిగితే ఆ పంటకు బీమా పరిహారం చెల్లిస్తూ వస్తున్నారు. తాజాగా 2019 నుంచి ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తామని చెప్పడంతో అసలు మోసం మొదలైంది. బీమా పరిధిలోకి వచ్చే రైతులను తగ్గించేందుకు ప్రణాళిక వేసినట్టుగా తెలుస్తోంది. అందుకే ఎప్పుడూ లేని రూల్స్ తెర మీదకు తెచ్చారు. దీంతో లక్షలాది రైతులు పంటల బీమా పరిహారానికి దూరమయ్యారు.
చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి
2019 నుంచి ఏటా 48 లక్షల మంది రైతులు పంటల బీమా పరిదిలోకి వస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. 2019 ఖరీఫ్‌లో 36 లక్షల మంది రైతులు అనేక కారణాల వల్ల పంటలు కోల్పోయారు. అయితే, బీమా ప్రీమియం కంపెనీలకు చెల్లించకుండా నిలిపివేసిన వైసీపీ ప్రభుత్వం, అసెంబ్లీలో రచ్చ కావడంతో ప్రీమియం చెల్లిస్తే మీకెందుకు, చెల్లించకపోతే మీకెందుకు అని ఎదురు దాడికి దిగారు. రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందనే భయంతో వెంటనే రాత్రికి రాత్రి రూ.590 కోట్లు ప్రీమియం విడుదల చేశారు. తాజాగా మొత్తం రూ.1200 కోట్లు పంటల బీమా పరిహారంగా చెల్లించారు. 2019 ఖరీఫ్‌లో 36 లక్షల మంది రైతులు నష్టపోతే కేవలం ప్రభుత్వం 12 లక్షల మంది రైతులకు మాత్రమే పంటల బీమా పరిహారం చెల్లించి భారీ ప్రకటనలు గుప్పించారు. ఇలా దాదాపు ప్రతి గ్రామంలో పది మంది రైతులకు పంటల బీమా పరిహారం అందితే 200 మందికి అందలేదు. దీంతో గ్రామాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. సర్కారు చేసిన మోసం రైతులు గమనించారు.

కొత్త రూల్స్ పెడితే చెప్పరా?
2019 నుంచి పంటల బీమాలో కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు. తప్పులేదు. కానీ ఆ నిబంధనలు రైతులకు వివరించాల్సిన పనిలేదా? అసలు పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోంది. రైతులు కేవలం బ్యాంకుల్లో భూములు తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకుంటున్నారు. సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత అధికారులకు లేదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులు రుణాలిచ్చేప్పుడే రైతులకు ఆ మాట చెబితే బ్యాంకుల్లో నమోదు చేసుకున్న పంట సాగు చేసుకునేవారిమని రైతులు వాపోతున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి అయినా లోపాలను సవరించాలని, నష్ట పోయిన రైతులందరికీ 2019, 2020 పంటల బీమా పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కావాలనే చేశారా..
గతంలో పంటల బీమా ప్రీమియం చెల్లింపులో రైతుల వాటా ఉండేది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మొత్తం తామే చెల్లిస్తామని ప్రకటించారు. అయితే ,2019 నుంచి గత నెల వరకు ప్రీమియం చెల్లించలేదు. అడిగేవారు లేరు కదా అని వదిలేశారు. నివర్ తుపాను భారీ నష్టాలను మిగల్చడంతో పంటల బీమా పరిహారం మరోసారి తెరమీదకు వచ్చింది. దీంతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. పంటల బీమా పరిహారం చెల్లించినట్టే ఉండాలి, కానీ భారం పడకూడదు అన్న చందంగా కేవలం రూ.1200 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకున్నారు. అదే ప్రభుత్వం కంపెనీలకు ప్రీమియం చెల్లించి ఉంటే నివర్ తుఫాను నష్టం కింద రైతులకు రూ.5000 కోట్ల పంట నష్ట పరిహారం అందేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పంటల బీమా ఖర్చు తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఇలా చేసి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.











