తెలగాణలో కురిసిన అతి భారీ వర్షాలు హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. కాలనీలు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 మంది వరకు ప్రాణనష్టం వాటిల్లింది. హైదరాబాద్‌లోనైతే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా వరుణుడు తన ప్రతాపాన్ని నగరంపై చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎరరాల్లో పంట నీటమునిగింది. దీనిపై తెలంగాణ సీఎం కేసిఆర్.. ప్రధానికి లేఖరాశారు. తక్షణ సాయం కింద రూ.1350 కోట్లు ఇవ్వాలని లేఖలో తెలిపిన విషయం తెలిసిందే. అలాగే వరదల వల్ల వాటిల్లిన మొత్తం నష్టం రూ.5వేల కోట్లుగా అంచనా వేశారు. వరదల వల్ల అతలాకుతలం అయిన రాష్ట్రాన్ని ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ కూడా సీఎం కేసిఆర్‌కు ఫోన్ చేసి తెలిపారు. ఈనేపథ్యంలోనే కేంద్ర బృందం తెలంగాణలో పర్యటనకు ఈ రోజు నగరానికి వచ్చింది. సీఎస్ సోమేష్‌కుమార్‌తో ఐదుగురు సభ్యుల బృందం భేటీ అయింది. ఆ తరువాత ముంపు ప్రాంతాల్లో అధికారులు పర్యటించనున్నారు.
అయితే తెలంగాణను వరదలు ముంచెత్తిన 9 రోజుల తరువాత కేంద్రం హైదరాబాద్ కు వచ్చింది. ఇప్పుడు పర్యటిస్తే ముంపు ప్రాంతాల తీవ్రత తెలిసే అవకాశం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం బృందం పర్యటన ఎలా ఉంటుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ మేరకు నష్టాన్ని అంచనా వేసి.. ఏ మేరకు నిధులను విడుదల చేస్తారో చూడాల్సి ఉంటుంది.
రెండు రోజుల పర్యటన..
ప్రవీణ్ వశిష్ట నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనుంది. ఒక రోజు హైదరాబాద్‌లో మరో రోజు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది. ఈరోజు, రేపు జరిగే ఈ పర్యటనలో భాగంగా కేంద్ర బృందం అనేక ప్రాంతాల్లో పర్యటించి ఆస్తినష్టం, ప్రాణనష్టం వివరాలపై ఓ అంచనాకు రానున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిన ఓ నివేదికను కేంద్రానికి పంపించినట్లు తెలిసింది. నష్టం అంచనాపై మరో పూర్తి స్థాయి నివేదికను కూడా మరోసారి కేంద్ర బృందానికి తెలంగాణ ప్రభుత్వం అందించనుంది. వరద నష్టాలపై కేంద్ర బృందం సమగ్ర నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది.
ప్రభుత్వ లెక్కల అంచనా?..
భారీ వర్షానికి రాష్ట్రవ్యాప్తంగా 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగినట్లు అధికారులు గతంలో ప్రాథమిక అంచనాకు వచ్చారు. వీటి నష్టం సుమారు రూ.2వేల కోట్ల వరకు ఉంటుంది. వందేళ్ల తరువాత ఒకే రోజు 31 సెం.మీ. వర్షపాతం నమోదవడంతో వరదలు, వర్షాల కారణంగా 50 మంది మృత్యువాతపడ్డారు. జిహెచ్ఎంసి పరిధిలో 11 మంది మరణించారు. నగరంలోని 144 కాలనీలు, 20540 ఇళ్లు నీటమునిగాయి. 65 ఇళ్లు పాక్షికంగానూ 14 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు 35 వేల కుటుంబాలు వరదల కారణంగా నిర్వాసితులయ్యారు. రాష్ట్రంలో 30 పట్టణాల్లో వరదల ప్రభావం ఉంది. రాష్ట్ర వ్యాప్తతంగా 101 చెరువల కట్టలు తెగిపోతే, 26 చెరువులను రంధ్రాలు పడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మొత్తంగా విద్యుత్ శాఖకు రూ.5కోట్ల మేర నష్టం జరగింది. బీటీ రోడ్లు, 6 చోట్ల జాతీయ రహదారులు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాలో తెలంగాణ అధికారులు వివరాలను తెలిపారు. అయితే ఈ నివేదికను మార్చి మరో పూర్తి స్థాయి నివేదికను కేంద్ర బృందానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.











