వందేళ్లలో ఒక సారి వచ్చే అసాధారణ పరిస్థితులు మొన్న మళ్లీ హైదరాబాద్‌లో తలెత్తాయి. హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు ఇళ్లల్లోకి వరదనీరు వచ్చి నీటమునిగి పప్పులు, ఉప్పులు, విలువైన సామాన్లన్నీ కొట్టుకుపోయాయి. మనుషులు, పశువులు గట్రా కూడా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వేల కుంటుంబాలు బిక్కుబిక్కుమంటూ వరదలోనే ఉండిపోయాయి. తినడానికి తిండిలేక ఎక్కడ ఉండలో తలియకా చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో పర్యటనకు వెళ్లిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులపై జనం తిరగబడ్డారు. గతంలో రానీ నేతలు ఇప్పుడు ఎందుకొచ్చారని నిలదీశారు. నమ్మి ఓట్లేసే తమను వరద నీటిలో ముంచారని ఆవేదనను వ్యక్తం చేశారు.
గతంలో హైదరాబాద్ ఎన్నడూ ఇంతలా వరద ముంపులో మునిగిపోయిన దాఖలాలు లేవు. 2000 సంవత్సరంలో వరదలు వచ్చినప్పటికినీ ఈ స్థాయిలో ప్రాంతాలు ముంపుకు గురికాలేదు. ఒకవైపు జనం.. అధికార పార్టీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తుంటే, మరోపక్క ప్రతిపక్ష పార్టీలు ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. అదేస్థాయిలో మీడియా కూడా వరదలో ముంపుకు గురైన కాలనీలు, ప్రాంతాలు, కుటుంబాల సమస్యలపై ఫుల్ కవరేజీ ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలో ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. అధికారులు, అధికార పార్టీ నేతలు కనబడితే చాలూ ప్రశ్నించడం ప్రారంభించారు. ఇది ప్రతిపక్ష పార్టీలకు రాజకీయంగా బాగా కలిసొచ్చే అంశం. అసలే జిహెచ్ఎంసి ఎన్నికలను డిసెంబర్‌లో నిర్వహించాలని అధికార పార్టీ ఒక పక్క సమాయత్తం అవుతుంటే ఈ వరదలు వచ్చి టిఆర్ఎస్ పార్టీ ఆలోచనలను తారు మారు చేసిందనే చెప్పాలి.
ప్రతి కూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సిఎం కెసిఆర్ దిట్ట. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే ఒక ప్రకటన చేశారు. వదరల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇస్తున్నట్లు సిఎం కేసిఆర్ ప్రకటించేశారు. దీంతో హైదరాబాద్ వదల విషయంలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించే వారికి సరిగ్గా చెక్‌పెట్టేసినట్లయింది. అయితే ఇలా సాయం చేయడం మంచి విషయమే. కానీ ఈ సాయాన్ని ఏ కోణంలో చూడాలి అనే చర్చ ఇప్పుడు సర్వత్ర మొదలైంది. దీనిని సాయం అనుకోవలనా? లేక రాజకీయ కోణంలో చూడాల్సి ఉంటుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో రాబోతున్న జిహెచ్ఎంసి ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ దాదాపు అన్ని రకాలుగా ఇప్పటికే సిద్ధమైంది. తరువాయి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడం, ఎన్నికల ప్రచారం, పోలింగ్ ఇలాంటి అంశాలపైన ముందే సిద్ధమైంది.
ఈతరుణంలో ఎవరూ ఊహించనంతగా హైదరాబాద్.. వరదలకు మునిగిపోయింది. దీంతో టిఆర్ఎస్ ప్లాన్‌లు అన్నీ తారుమారు అయిపోయినట్లు అయింది. అలాగే ప్రజల నుంచి కూడా వ్యతిరేక రాగం మొదలైంది. ఇది గమనించిన గులాబీ బాస్.. వెంటనే మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, ఇళ్లు కూలిపోయిన వారికి ఇళ్లు, దెబ్బతిన్న ఇళ్లకు నగదు సాయం, ప్రతి ఇంటికి రూ.10 వేల సాయాన్ని వెనువెంటనే ప్రకటించారు. ఈ ప్రటనల వెనుకాల కచ్చితంగా రాజకీయ కోణమే దాగుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో వ్యతిరేక ఓటు రాకుండా ఉండేందుకు రూ.10వేల సాయాన్ని ప్రకటించారనే ఆరోపణలను కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. వేల రూపాయలు నష్టపోయిన బాధితులకు ఈ రూ.10వేల సాయం ఏమూలాన సరిపోతుందని పలు విమర్శలను కూడా గుప్పిస్తున్నాయి. దీనిని కచ్చితంగా రాజకీయ కోణంలోనే చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.