యావత్ ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల ఇప్పటికీ లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం తన విశ్వరూపం చూపిస్తుంది. ప్రస్తుతం కరోనా తీవ్ర స్థాయిలో విజృభిస్తున్న నేపథ్యంలో యూరప్ దేశం ఫ్రాన్స్ లో లాక్ డౌన్ కొనసాగుతుంది. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతూండడంతో సగానికి పైగా ఐసీయూ బెడ్స్ కోవిడ్ రోగులతో నిండిపోతున్నాయి. అందుకే ఫ్రాన్స్ లో డిసెంబర్ 1 వరకు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా ప్యారిస్ సహా ప్రధాన పట్టణాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అత్యావసరాల కోసం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరులెవరు బయటకు రావద్దని తెల్చి చెప్పేసింది. దీంతో సెలవులు ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే వారు, నిబంధనల నేపథ్యంలో ఇళ్లకు చేరుకునే వారి వాహనాలతో రాజధాని నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 435 మైళ్లు అంటే 700 కిలో మీటర్ల మేర రోడ్ల మీద వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
కారణం లేకుండా స్నేహితుల ఇళ్లకు వెళ్లడం, వాళ్లను ఆహ్వానించడం, అంతా కలిసి బయటకు వెళ్లడం వంటివి ఇకపై కుదరకపోవచ్చు. ప్రతిఒక్కరు లాక్‌డౌన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది’’అని ప్రధాని జీన్ కాస్టెక్స్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో మార్నింగ్‌వాక్, ఎక్సర్‌సైజ్ కోసం బయటకు వెళ్లే ప్రజలు.. అందుకోసం ఇంటి నుంచి కిలోమీటరు పరిధిలో ఉండే ప్రాంతాలు ఎంచుకోవాలని, వైద్య అవసరాలు, నిత్యావసరాల కోసం మినహా బయటకు రావొద్దని అధికారులు స్పష్టం చేశారు.
రెస్టారెంట్లు, కేఫ్‌లు మూసివేయాలని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే నెలలపాటు ఇంట్లోనే మగ్గిపోయిన తమకు ఈ లాక్‌డౌన్ వల్ల మరోసారి నాలుగు గోడలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.











