ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తుది ఘట్టానికి చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టి, పనులను పరుగులు పెట్టించింది. ఏపీ మౌలిక వసతుల రంగానికి మకుటాయమానంగా నిలిచే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ఆగస్టు 1న అట్టహాసంగా ప్రారంభించేందుకు రాష్ట ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు దేశ, రాష్ట్ర రాజకీయాలకు చెందిన పలువురు VIPలు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేయనుండగా, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకకు నాయకత్వం వహించనున్నారు. వీరితో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, GMR గ్రూప్ ఛైర్మన్ గ్రాంధి మల్లికార్జునరావు సహా రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ మహత్తర ఘట్టంలో పాల్గొననున్నారు.
కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఢిల్లీ స్థాయిలోని పౌర విమానయాన, హోం శాఖల నుంచి రావాల్సిన కీలక క్లియరెన్స్‌లను శరవేగంతో తెప్పించడంలో ఆయన చురుగ్గా వ్యవహరించారు. ఎయిర్‌పోర్ట్‌కు ఇమిగ్రేషన్ చెక్‌పోస్ట్ హోదా ఇప్పించడంతో పాటు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) అనుమతులు, డీజీసీఏ (DGCA) ట్రయల్ రన్స్ వేగవంతంగా పూర్తయ్యేలా ఆయన పర్యవేక్షించారు.
కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖపట్నాన్ని అంతర్జాతీయ ఐటీ, టూరిజం, లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దాలనే సీఎం చంద్రబాబు దార్శనికతకు ఈ ఎయిర్‌పోర్ట్ ఇంజిన్‌గా మారనుంది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.4,750 కోట్ల భారీ వ్యయంతో GMR సంస్థ దీనిని నిర్మించింది. రాయ్‌పూర్ – విశాఖ ఎకనామిక్ కారిడార్ మరియు 6-లేన్ బీచ్ రోడ్ ఎక్స్‌ప్రెస్ వే కనెక్టివిటీ తోడవ్వడంతో, విశాఖ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు, రియల్ ఎస్టేట్ పురోగతికి భోగాపురం విమానాశ్రయం సరికొత్త ఊపునిస్తోంది.
తొలి దశలోనే ఏడాదికి ఏకంగా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలుందించేలా, భారీ కార్గో టెర్మినల్‌తో అత్యాధునిక సాంకేతికతతో ఈ ఎయిర్‌పోర్ట్ డిజైన్ చేయబడింది. ఆగస్టు 1న జరిగే అట్టహాసపు ప్రారంభోత్సవం తర్వాత, ఆగస్టు మూడో వారం నాటికే పూర్తిస్థాయి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్ అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాక, రీజియన్ వ్యాప్తంగా ఆర్థిక విప్లవం ఆరంభం కానుంది.











