వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు అమాయక గొర్రెల కాపరి ప్రాణం బలయ్యాడు. ఆ పాపాన్ని వేరొకరిపై నెట్టేందుకు పోలీసులు, మాజీ మంత్రి అనుచరులు ఆడిన హైడ్రామా చివరకు అడ్డంగా బుక్కయింది. నిందితుడిని కేసు నుంచి తప్పించేందుకు వేసిన పక్కా ప్లాన్‌ను సీసీటీవీ ఫుటేజ్ ముక్కలు ముక్కలు చేసింది. దీంతో తూతూమంత్రంగా సాగిన డ్రామా బెడిసికొట్టి, అసలు నిందితుడైన ఆరవ్‌ను పోలీసులు అరెస్ట్ చేయక తప్పలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..మాజీ మంత్రి కొడుకును కాపాడేందుకు అత్యంత వేగంగా చక్రం తిప్పారు. ప్రమాదానికి ఏమాత్రం సంబంధం లేని ఆరవ్ స్నేహితుడిని తెరపైకి తెచ్చారు. అతడే బైక్ నడిపాడంటూ రికార్డులు సృష్టించి FIRలో నిందితుడిగా మార్చేశారు. అంతటితో ఆగకుండా, పోలీస్ స్టేషన్ పరిధిలోనే అతనికి అత్యంత వేగంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా పంపించేశారు. వ్యవస్థలను వాడుకుని నిందితుడిని ఎలా కాపాడాలనే దానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.
మరోవైపు, ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు తెరవెనుక భారీ ఆర్థిక లావాదేవీలు నడిచాయి. చనిపోయిన సామాన్య గొర్రెల కాపరి కుటుంబం నుంచి ఎలాంటి తిరుగుబాటు, నిరసనలు రాకుండా ఉండేందుకు ఏకంగా రూ. 9 లక్షల మొత్తంతో తెరవెనుక సెటిల్మెంట్ కూడా పూర్తి చేశారు. డబ్బుతో సామాన్యుడి ప్రాణాన్ని కొనేసి, అధికార బలంతో కేసును అణచివేయాలని చూశారు.
అయితే, పాపం పండినట్లు ఈ వ్యవహారానికి సంబంధించిన పక్కా సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో కథ అడ్డం తిరిగింది. ప్రమాదం చేసింది, బైక్ నడిపింది మాజీ మంత్రి కుమారుడు ఆరవ్ మాత్రమేనని సీసీటీవీ ఆధారాలతో స్పష్టమవడంతో పోలీసుల తప్పుడు ప్లాన్ బట్టబయలైంది. ఆధారాలు సామాజిక మాధ్యమాల్లోకి రావడంతో తలదించుకున్న పోలీసులు, చేసేదేమీ లేక రూట్ మార్చి అసలు నిందితుడైన ఆరవ్‌ను అరెస్టు చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే అధికార పార్టీ నేతల కాళ్లదగ్గర మోకరిల్లి తప్పుడు కేసులు బనాయించడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.











