ఈ బాలీవుడ్ కు ఏమైంది.. ఓ వైపు డ్రగ్స్, ఇంకో పక్క సెక్స్.. సినిమా రంగంలో ఏది జరిగినా బూతద్దంలోనే కనిపిస్తుంది. రచ్చచేసుకుని వార్తల్లోకి ఎక్కడం వల్ల ఎవరికీ ఒరిగేది ఉండకపోయినా జనానికి మంచి కాలక్షేపం. మొన్న రియా, నిన్న కంగన, ఈరోజు పాయల్ ఘోష్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఏ సినిమా రంగానికైనా క్యాస్టింగ్ కౌచ్ కొత్త కాదు. మీటూ ఉద్యమాల లాంటివి చల్లారినా తాజా ఆరోపణలు వేడిపుట్టిస్తున్నాయి. నటుడు, దర్శకుడు అనురాగ్ కాశ్యప్ పై నటి పాయల్ ఘోష్ ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అతను తనపై అత్యాచారయత్నం చేయబోయాడన్నది ఆమె ఆరోపణ.
ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ ఏకంగా ప్రధాని మోడీ సహాయం కూడా కోరింది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎప్పుడూ నరేంద్ర మోడీకి టచ్ లో ఉంటుందామె. అనురాగ్ కశ్యప్ పై చర్యలు తీసుకోవాలని మోడీజీని ట్విట్టర్ ద్వారానే కోరింది. రియా, కంగనల వార్తలు మరుగున పడాలంటే ఇంకో హాట్ వార్త అవసరం కాబట్టి ఆ లోటును ఇప్పుడు పాయల్ భర్తీ చేస్తోంది. అసలు విషయానికి వస్తే అనురాగ్ రమ్మంటే ఓరోజు ఆమె వెళ్లి కలిసిందట. ఆ సమయంలో అతను మందు తాగుతున్నాడు. గంజాయి కూడా ఉందట. ఆమె రాగానే తనతో ఇంకో గదిలోకి తీసుకువెళ్లాడు. అప్పుడతను బాంబే వెల్ వెట్ సినిమా చేస్తున్నాడు.
రణబీర్ కపూర్ సినిమాలో అవకాశం రావాలనుకునే అమ్మాయిలు తనతో పడుకుంటారని ఆమెతో అన్నాడట. తనతో సన్నిహితంగా ఉంటే ఆమెను పైకితీసుకు వస్తానన్నాడట. సినిమా పరిశ్రమలో శారీరక సంబంధాలు తప్పుకాదట.
హ్యుమా ఖురేషి, రిచా చద్దా, మహిగిల్ తను పిలిస్తే వచ్చేస్తారని అన్నాడట. ఆ సమయంలోనే ఆమెపై అత్యాచార యత్నం చేయబోయాడట. తనకు అది నచ్చక వచ్చేశాననేది పాయల్ ఆరోపణ. ఇది నాలుగైదేళ్ల క్రితం జరిగిన విషయమట. బయటకు చెబుదామంటే తనను చాలామంది భయపెట్టారని ఆమె అంటోంది. సినిమా అవకాశాల కోసం ఇలా డైరెక్టర్లను కలవడం తప్పుకాదని, తను కూడా అలాగే కలిశానని పాయల్ అంటోంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఇన్నేళ్ల తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మోదీజీ ఇప్పుడామెకు ఎలాంటి న్యాయం చేయాలి?.. ఇవన్నీ ప్రశ్నలే.
మరో విషయం ఏమిటంటే పాయల్ చెప్పే విషయం కొత్త కాదు.. సినిమా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో జరిగిన అనుభవాల్లాంటిదే ఇది కూడా. ఇప్పుడు అనురాగ్ కాశ్యప్ పై బురద జల్లడానికి ప్రత్యేకమైన కారణం ఏదో ఉండితీరాలి.. అది ఏమై ఉంటుంది. నెటిజన్లు కూడా ఇలాంటి శోధనలోనే ఉన్నారు. ఇక అనురాగ్ కాశ్యప్ విషయానికి వస్తే అతను కూడా వివాదాస్పద వ్యక్తే. నిన్ననే అతను కంగనను కెలికాడు. నువ్వు మణికర్ణికవా.. అయితే చైనాతో పోరాడు అన్నాడు. నారీ నారీ నడుమ మురారి లాగా ఉంది అనురాగ్ పరిస్థితి. వివాదాలు కోరుకునే వారికి ట్విట్టర్ ఇప్పుడొక వేదికగా మారింది. ఈ ఆరోపణలకు అనురాగ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.











