ఆదివారం జరుగనున్న మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ప్రతిభావంతులైన ఆటగాళ్లుగా, టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌లుగా భావిస్తున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ చెరో టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఈ రెండు టీమ్‌లు 24 సార్లు తలపడగా.. కింగ్స్ లెవెన్ పంజాబ్ 14సార్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 10 సార్లు విజయం సాధించాయి. మరి, ఆదివారం జరుగనున్న మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ బలాలు
గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌గా ఉన్న ఈ జట్టు.. రెండు సీజన్ల కిందట ఢిల్లీ క్యాపిటల్స్‌గా మారింది. పేరు మారినప్పటికీ ఈ జట్టు రాత మాత్రం మారలేదు. ఈ టీమ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేకపోయింది. అయితే ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శన చేయాలని కృతనిశ్చయంతో ఉంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో ఎలాగైనా టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. శిఖర్ ధవన్, రహానె, శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా, రిషభ్ పంత్.. ప్రస్తుత టీమిండియాలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అందరూ ఢిల్లీ టీమ్‌లోనే ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల విండీస్ స్టార్ హెట్‌మయెర్ ఢిల్లీ జట్టుకు అదనపు బలం. ఇక, ప్రస్తుత సీజన్‌లో అత్యంత పటిష్టమైన స్పిన్ విభాగం కలిగిన టీమ్‌లలో ఢిల్లీ మొదటి వరుసలో ఉంటుంది. అశ్విన్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్, సందీప్ లామి వంటి మెరుగైన స్పిన్నర్లు ఢిల్లీ జట్టులో ఉన్నారు. లెజెండరీ ఆటగాడు రికీ పాంటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తుండడం ఢిల్లీకి సానుకూలాంశంగా మారనుంది.
బలహీనతలు: ఢిల్లీకి మిడిలార్డర్ పెద్ద ఇబ్బందిగా మారింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే ఫామ్‌లో ఉన్నాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన హెట్‌మయెర్, మార్కస్ స్టోయినిస్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. పేస్ అటాక్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇషాంత్, మోహిత్ వంటి సీనియర్లున్నా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. రబాడ ఒక్కడే రాణిస్తున్నాడు.
ఢిల్లీ జట్టు (అంచనా)
శిఖర్ ధవన్, రహానె, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), పృథ్వీ షా, రిషభ్ పంత్, స్టోయినిస్, అశ్విన్, ఇషాంత్, కీమో పాల్, రబాడ, అక్షర్ పటేల్
కింగ్స్ లెవెన్ పంజాబ్ బలాలు
ఈ జట్టు ఆరంభం నుంచి నాయకత్వ సమస్య ఎదుర్కొంటోంది. ప్రస్తుతం 13వ సీజన్ ఆడుతున్న పంజాబ్‌కు 13వ కెప్టెన్ వచ్చేశాడు. ఈసారి సారథిపైనే జట్టు మొత్తం ఆశలు పెట్టుకుంది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ఈసారి పంజాబ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. రాహుల్ బ్యాటింగ్ సామర్థ్యం గురించి అందరికీ తెలిసిందే. మొదటి నుంచి ఏడో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సత్తా అతని సొంతం. వికెట్ కీపర్ బాధ్యతలు కూడా చేపడుతున్నాడు. క్రిస్ గేల్, మ్యాక్స్‌వెల్ లాంటి హార్డ్ హిట్టర్లు పూర్తి ఫిట్‌గా ఉన్నారు. వీరిద్దరిలో ఏ ఒక్కరు చెలరేగినా ప్రత్యర్థి టీమ్‌కు చుక్కలే. సర్ఫ్‌రాజ్ ఖాన్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ కూడా టాపార్డర్‌లో బాధ్యతలు తీసుకుంటే పంజాబ్‌కు తిరుగులేదు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో షమీ, కాట్రెల్ సేవలు కీలకం కానున్నాయి. మాస్టర్ బ్రెయిన్ అనిల్ కుంబ్లే ఈసారి ప్రధాన కోచ్‌గా సేవలందించనుండడం కలిసొచ్చే అంశం.
బలహీనతలు
ఒకరిద్దరు స్టార్ ప్లేయర్ల మీదే ఆధారపడటం పంజాబ్‌కు ఉన్న అతిపెద్ద బలహీనత. సమష్టిగా రాణించడంలో పంజాబ్ విఫలమవుతోంది. బౌలింగ్‌లో షమీ, కాట్రెల్‌కు అండగా నిలిచే వారు లేకపోవడం లోటు. మిడిలార్డర్ కూడా కాస్త బలహీనంగా కనబడుతోంది. స్పిన్ విభాగం చాలా వీక్.
పంజాబ్ జట్టు (అంచనా)
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, మ్యాక్స్‌వెల్, సర్ఫ్‌రాజ్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, షమీ, రవి బిష్ణోయ్, ముజీబ్, కాట్రల్/జోర్డాన్.
మ్యాచ్ ఫేవరెట్: ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టు అండర్‌డాగ్‌గా బరిలోకి దిగుతోంది. యంగ్, స్టార్ ఆటగాళ్లతో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. టైటిల్ సాధించే అర్హత ఉన్న జట్టుగా అందరూ భావిస్తున్నారు. మరోవైపు రాహుల్, గేల్, మ్యాక్స్‌వెల్ మీదే పంజాబ్ ఆధారపడుతోంది. బౌలింగ్‌లో బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌పై ఢిల్లీదే పైచేయిగా కనిపిస్తోంది. అయితే ముందుగా అనుకున్నట్టు గేల్, మ్యాక్స్‌వెల్ చెలరేగితే మాత్రం పంజాబ్‌ను ఎవరూ ఆపలేరు.










