బిగ్ బి అమితాబ్ గళంలో ఓ గాంభీర్యం ఉంటుంది. తాను నటించకపోయినా కొన్ని సినిమాలకు ఆయన గాత్రదానం చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాధేశ్యామ్ చిత్రం కోసం ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో రాధేశ్యామ్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 1980లో ఇటలీ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఓ ప్రేమకథకు కొన్ని వాస్తవ ఘటనలను జోడించి ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ రాధాకృష్ణ.
ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. సంక్రాంతికి విడుదల చేద్దామనుకొని ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కానీ కరోనా కారణంగా సినిమాని మళ్ళీ వాయిదా వేశారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తాజా అప్ డేట్ ఏంటంటే అమితాబ్ ఈ సినిమా కోసం గళం ఇవ్వడం. ముఖ్యంగా ఈ సినిమా బాలీవుడ్ లో కూడా విడుదలవుతుండటంతో అమితాబ్ గళం దీనికి ప్లస్ అవుతుందని చెప్పక తప్పదు. పైగా అమితాబ్, ప్రభాస్ కలిసి ప్రాజెక్ట్ కె అనే సినిమాలో నటిస్తున్నారు.
ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాజుగారి మర్యాదలు మామూలుగా ఉండవు కదా. అందుకే ప్రభాస్ రాజు మర్యాదలకు అమితాబ్ కూడా ఫిదా అయిపోయారు. ప్రభాస్ ను పొగుడుతూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. రాధేశ్యామ్ కోసం వాయిస్ ఇమ్మని ప్రభాస్ అడగ్గానే అమితాబ్ ఓకే అనేశారు. మార్చి 11న రాధేశ్యామ్ విడుదలవుతోంది. అమితాబ్ చేసిన ఈ గాత్ర దానానికి మేకర్స్ కూడా ఫిదా అయ్యారు.
అమితాబ్ నటించిన సెహెన్ షా చిత్రంలో ఫొటోపైన ‘ మీ అద్భుతమైన గళంతో ఈ అజరామర ప్రేమ కథకు మరింత రాణింపు తెచ్చినందుకు ధన్యావాదాలు అమిత్ జీ’ అని పేర్కొని పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అమితాబ్ ఇలా ఇతర సినిమాలకు తన గళాన్ని ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అమీర్ ఖాన్ నటించిన లగాన్, అశుతోష్ గోవరికర్ జోధా అక్బర్, విద్యాబాలన్ పరిణీత, సత్యజిత్ రే శత్రంజీ కే ఖిలాడీ సినిమాలకు కూడా వాయిస్ ఇచ్చారు. సినిమాలో ఏ సందర్భంలో ఈ వాయిస్ వస్తుందో చూడాలి.











