అలవాటు వరుసగా సక్సెస్ అవుతుంటే.. చివరికది సెంటిమెంటై కూర్చుంటుంది. సినీ రంగంలో ఇది చాలా ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. హీరోలు, దర్శకులు, నిర్మాతలు.. ఎవరైనా సరే.. ఏదో ఒక సెంటిమెంట్ ను ఫాలో అవనిదే వారికి నిద్రపట్టదు. ఒకో దర్శకుడికీ ఒకో సెంటిమెంట్ ఉన్నప్పటికీ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సెంటిమెంట్ అంతకు మించి అనే వెలెల్లో ఉంటుంది. ఆయనది సంక్రాంతి సెంటిమెంట్. అనిల్ సంక్రాంతి సీజన్ లో విడుదల చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టరే.
అనిల్ తొలి సినిమా ‘పటాస్’ నే తీసుకుంటే..అది సంక్రాంతి సీజన్ లోనే విడుదలైంది. ఆ సినిమా బ్లాక్ బస్టరైన సంగతి తెలిసిందే. అలాగే.. లాస్టియర్ విడుదలైన వెంకీ, వరుణ్ తేజ తోడల్లుళ్ళుగా కావాల్సినంత వినోదం పంచిన ‘ఎఫ్’ 2 సరిగ్గా సంక్రాంతికే విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన.. మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సైతం సూపర్ హిట్టైంది. అందుకే దీన్ని మంచి సెంటిమెంట్ గా భావించిన అనిల్ .. తన తదుపరి చిత్రం ఎఫ్ 3ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన ఏడునెలల బ్రేక్ .. ఆ సినిమాను ఇంకా సెట్స్ మీదకు తీసుకెళ్ళలేని పరిస్థితులేర్పరిచింది.
దాంతో అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ని సంక్రాంతి సీజన్ లో విడుదల చేయలేకపోయినా.. ఆ మూవీ షూటింగ్ నయినా వచ్చే సంక్రాంతికి ప్రారంభించాలని భావిస్తున్నాడట. ఇలా మరో విధంగా తన సంక్రాంతి సెంటిమెంట్ ను అనిల్ రావిపూడి వినియోగించుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక ఎఫ్ 3 లో వెంకీ, వరుణ్ లతో పాటు వారి సరసన కథానాయికలు గా నటంచిన తమన్నా, మోహ్రీన్ లు సైతం నటిస్తుండగా.. మరో హీరోగా సునీల్ ను ఎంపిక చేయబోతున్నారనే వార్తలొస్తున్నాయి. ఇందులో ఇంకా పూర్తి క్లారిటీ లేదు. మరి ఈ సినిమా అనిల్ రావిపూడి సెంటిమెంట్ ను మరోసారి వర్కవుట్ చేస్తుందేమో చూడాలి.











