ఏపీలో మద్యం ధరలను సవరించారు. ఈ మేరకు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మీడియం ప్రీమియం కేటగిరీలలో 25 శాతం వరకు ధరలను తగ్గిస్తూ నిర్ణయం వెలువడింది. కనీసంగా రూ. 40 నుంచి గరిష్టంగా 1350 రూపాయల వరకు ధరలు తగ్గుతాయి. సవరించిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయి. ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ తో పాటు, విదేశీ మద్యానికి కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది.
250-300 మధ్య ధర ఉండే లిక్కర్ పై రూ.50 రూపాయలు తగ్గించారు.
ధరలు అమాంతం పెరిగాయి..
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం తీసుకువస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. పాలనలోకి రాగానే.. మద్యం షాపుల సంఖ్య తగ్గించారు. ధరలను అనూహ్యంగా పెంచారు. ఇది నిషేధానికి దగ్గరి దారి అని సెలవిచ్చారు. మద్యం నిషేధించడం కాదు.. మద్యం తాగే అలవాటును తగ్గించడమే లక్ష్యం అన్నట్లుగా పార్టీ నాయకులు.. ఈ ధరల పెంపు గురించి సమర్థించుకున్నారు. మద్య ప్రియులకు అలవాటైన బ్రాండ్లేవీ అందుబాటులో లేకుండా చేసి.. ఊరూ పేరూ తెలియని నాసిరకం మద్యాన్ని మాత్రం పుష్కలంగా అధికరేట్లకు అందుబాటులో ఉంచారు.
తాగే అలవాటు తగ్గడం మాటేమోగానీ.. ఈ నిర్ణయాలన్నీ వెరసి నాటు సారా తయారీకి, మద్యం అక్రమ స్మగ్లింగ్ కి బాటలు వేశాయి. ప్రతిరోజూ లక్షలకు లక్షల విలువైన మద్యం పొరుగు రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ అవుతున్న ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ స్మగ్లింగ్ ను కట్టడి చేయలేకపోతోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీద విమర్శలు బాగా పెరిగాయి. అలాగే.. అయిన వారికి అడ్డగోలుగా లబ్ధి చేకూర్చేందుకు ఊరూ పేరూ లేని బ్రాండ్ల విక్రయాలకు తెరలేపారనే విమర్శలు కూడా వచ్చాయి.
ఇది మడమ తిప్పడమేనా?
ఇంత జరుగుతుండగా.. ప్రభుత్వం తాజాగా ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ ధరల పెంపును మద్య నిషేధంవైపు అడుగులుగా సమర్థించుకున్న నేపథ్యంలో.. నిషేధం అనే హామీపై జగన్ సర్కారు మడమ తిప్పినట్లేనా అనే చర్చ జరుగుతోంది. మందుబాబులకు జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పినట్టు భావించవచ్చు గానీ.. ఇది నిజంగా నిషేధంవైపు అడుగులేనేమో అనుకున్న వారు.. ఆగ్రహించే ప్రమాదం ఉంది.











