ఏపీలో రవాణా శాఖ పదిరెట్లు పెంచిన అపరాధ రుసుములతో లారీ యాజమానులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఏపీ నుంచి కోడిగుడ్ల ఎగుమతులు నిలిపివేయాలని లారీ యజమానులు ఓ నిర్ణయానికి వచ్చారు. దేశంలోనే కోడిగుడ్ల ఎగుమతిలో రెండో స్థానంలో ఉన్న ఏపీ నుంచి ఢిల్లీ, కోలకతా, జమ్మూ, కశ్మీర్, ఝార్జండ్ రాష్ట్రాలకు ప్రతి రోజూ 200 లారీల గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. సహజంగా కోడిగుడ్లు అట్టపెట్టల్లో భద్రంగా ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల లారీ లోడ్ హైట్ ఎక్కువగా వస్తోంది. ఏపీ ప్రభుత్వం తాజాగా లారీలపై అదనపు లోడ్, అంటే హైట్ కానీ, ఎక్కువ బరువుకానీ వేస్తే రూ.40 వేల అపరాధ రుసుం వేస్తున్నారు. దీంతో కోడిగుడ్లు రవాణా చేసే లారీ యజమానులు ఎగుమతులు నిలిపివేయాలని నిర్ణయించారు.
ఏపీ నిర్ణయంతో పౌల్ట్రీ పరిశ్రమకు తీరని నష్టం
ఏపీలో అత్యధిక మందికి ఉపాది కల్పిస్తున్న పరిశ్రమల్లో పౌల్ట్రీని కూడా ప్రధానమైనదని చెప్పుకోవచ్చు. ప్రతి రోజూ ఏపీలో 6 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. స్థానిక అవసరాలు పోను ప్రతి రోజూ 4 కోట్ల గుడ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. దీని వల్ల రైతులకు ప్రతి రోజూ రూ.20 కోట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇలా సంవత్సరం మొత్తం మీద రూ.7000 కోట్ల విలువైన గుడ్లు ఎగుమతి చేస్తున్నారు.
దీని వల్ల రాష్ట్రానికి కూడా ఏటా రూ.400 కోట్ల ఆదాయం పన్నుల రూపంలో వస్తోంది. అయితే ఏపీ రవాణా శాఖ తీసుకున్న నిర్ణయంతో గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. అసలే కరోనాతో నష్టపోయిన పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. చికెన్, గుడ్ల ధరలు కూడా భాగానే పెరగడంతో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల నుంచి బయటపడుతోంది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శరాఘాతంలా మారిందని కోళ్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎలా ఎగుమతి చేశారు?
సహజంగా నిర్ణీత పరిమితి కన్నా ఎక్కువ హైట్ లోడ్ చేసుకునే లారీల యజమానులు పెనాల్టీలు కడుతూనే ఉన్నారు. అయితే గతంలో ఒకసారి రూ.2000 పెనాల్టీ కడితే సరకు దించుకునే వరకూ మరే రాష్ట్రంలోనూ అధికారులు ఆపేవారు కాదని లారీ యజమానులు చెబుతున్నారు. తాజాగా పెంచిన అపరాధ రుసుములతో తమ లారీలు తిప్పలేమని, ఇప్పటికే నెలవారీ ఈఎంఐలు కట్టలేక పోవడంతో, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు నోటీసులు పంపిస్తున్నాయని వారు వాపోతున్నారు.
ఇలాగైతే ఎలాగన్నా…
రవాణా శాఖ అధికారులు నిబంధనలు అన్నీ నూరు శాతం అమలు చేస్తే 90 శాతం వాహనాలు నిలిచిపోతాయని చోదకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలను ప్రమాదాల నుంచి రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్నినాని చెప్పడంపై నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. రవాణా శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం ఒక్క లారీ యజమానులపైనే కాదు, అనేక పరిశ్రమలపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.











