శిరోముండనం కేసులో నటుడు, దర్శకుడు నూతన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక ఉడిపిలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైకు పారిపోదామని ప్రయత్నిస్తున్న ఆయనను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసులో నూతన్ నాయుడు పాత్ర ఉందని పోలీసులు స్పష్టం చేశారు. శ్రీకాంత్ అనే దళిత యువకుడిపై దాడి చేసి శిరోముండనం చేసిన ఘటనలో పోలీసులు ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
ఈ కేసులో నూతన్ నాయుడు చేసిన మరో ఫ్రాడ్ ని కూడా పోలీసులు గుర్తించారు. తన భార్య మధుప్రియను ఈ కేసు నుంచి తప్పించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రమేష్ పేరును ఆయన దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు. తమ ఇంట్లో జరిగిన అకృతాలను వీడియో తీసిన వారు ఎవరికి పంపారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.