జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్ మీడియాలో వార్ మొదలైంది. పవన్ రాజకీయ నిర్ణయాలపై తనదైన శైలిలో స్పందించే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. అయితే పవన్ కళ్యాణ్‌ను అమితంగా అభిమానించే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ ట్వీట్‌పై అంతే ఘాటుగా స్పందిస్తూ ప్రకాష్ రాజ్‌పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య నడుస్తున్న ఈ సోషల్ మీడియా వార్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల బరిలోకి రావడంపై ప్రకాష్ రాజ్ తన ఎక్స్ ఖాతాలో వ్యంగ్యంగా స్పందించారు. “మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి దొర .. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగిల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి” అంటూ తన మార్కు జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్‌తో ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా వస్తున్నారా లేక మరేదైనా పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నారా అనేది స్పష్టం చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో చర్చకు దారితీశాయి.
ప్రకాష్ రాజ్ ట్వీట్ బయటకు రాగానే రంగంలోకి దిగిన బండ్ల గణేష్ అత్యంత తీవ్ర పదజాలంతో కౌంటర్ ఇచ్చారు. “నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి?” అంటూ బండ్ల గణేష్ నేరుగా ప్రశ్నించారు. ప్రతి ఊర్లో, ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా అంటూ నిలదీశారు. ఎక్కడ చూసినా, ఏ విషయం వచ్చినా ప్రకాష్ రాజే కనిపిస్తున్నాడంటూ మండిపడ్డారు. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో కానీ, అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వద్దని, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకుని, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయాలంటూ బండ్ల గణేష్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని ప్రశ్నించిన ప్రకాష్ రాజ్‌కు, బండ్ల గణేష్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు పొలిటికల్ అండ్ సినీ సర్కిల్స్‌లో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ భక్తుడిగా పేరున్న బండ్ల గణేష్ ఇచ్చిన ఈ కౌంటర్‌ను జనసైనికులు, మెగా ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ ప్రకాష్ రాజ్‌ను ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి పవన్ తెలంగాణ పోటీ కంటే, ఈ ఇద్దరు సినీ ప్రముఖుల మధ్య రేగిన ట్విట్టర్ ఫైట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.











