బెంగళూరు యలహంక ప్యాలెస్ వివాదంపై ఏపీ PCC చీఫ్, మాజీ సీఎం జగన్ సోదరి షర్మిల ఫస్ట్ టైం స్పందించారు. నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు అంటూ సంచలన సోషల్మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. యలహంక ప్యాలెస్ విషయంలో జరుగుతున్న వివాదంలో అన్న జగన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు షర్మిల. యలహంక ప్రాపర్టీకి సంబంధించిన నిజాలను దేవుడి సాక్షిగా చెబుతున్నానని తన పోస్టులో పేర్కొన్నారు.
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వరకు యలహంక ప్రాపర్టీ ఉమ్మడి ఆస్తిగా ఉండేదని షర్మిల వివరించారు. అయితే కుటుంబ ఆస్తుల పంపకాల్లో భాగంగా యలహంక ప్రాపర్టీ పూర్తిగా 100 శాతం తనకే, తన పిల్లల భాగానికే వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. అది తన బిడ్డల హక్కు అని, YSR స్వయంగా తిరిగిన ఇల్లు కావడంతో దానిపై తమకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేశారు.
తమ కుమార్తె అంజలి కోరిక మేరకు, ఆమె పెరిగిన ఆ సొంత ఇంట్లోనే వివాహం జరిపించాలని భావించామని షర్మిల తెలిపారు. ఏ తల్లిదండ్రులకైనా సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ఎంతో అదృష్టమని, అయితే కుమార్తె ఆకాంక్షను నెరవేర్చలేకపోయినందుకు తీవ్రంగా బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి తమ బిడ్డ గురించి బాధపడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
వివాహ వేదిక మార్పుపై స్పందిస్తూ..ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని, ఎలాంటి వివాదాలు లేదా గొడవలు లేకుండా ప్రశాంతంగా వివాహం జరిపించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందుకే వైఎస్ అంజలి రెడ్డి – సోముల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నామని షర్మిల వెల్లడించారు. కాబోయే నవదంపతులకు ప్రజలందరి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని కోరారు.











