ఆంధ్రప్రదేశ్‌కు మరో గుడ్‌న్యూస్. ఏపీ మీదుగా బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. చెన్నై – మైసూరు మధ్య ప్రతిపాదించిన ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఏపీలోని చిత్తూరు జిల్లా గుండా వెళ్లనుంది. బంగారుపాలెం, పలమనేరు మీదుగా దాదాపు 77 కిలోమీటర్ల బుల్లెట్ రైలు మార్గం ఏపీ గుండా ప్రతిపాదించారు. ఏపీలో 41 గ్రామాల్లో భూ సర్వేతో పాటు శిలఫలాకాలు ఏర్పాటు చేయనున్నారు. దాదాపు ఏపీలోని 876 మంది రైతుల నుంచి భూ సేకరణ ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని రామాపురం దగ్గర ఓ స్టేషన్‌ను సైతం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది.
చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని జల్లిపేట, కూర్మాయి, మొరం, కొలమాసనపల్లె, పలమనేరు, పెంగరగుంట, సముద్రపల్లె వంటి ఊర్లలో భూసేకరణ చేస్తున్నారు. బైరెడ్డిపల్లె మండలంలో కంభంపల్లె, శెట్టిపల్లె, బేలుపల్లె, ఆళ్లపల్లె, లక్కనపల్లె ఊర్లలోకూడా భూసేకరణ, లైన్ అలైన్‌మెంట్ పనులు చేపట్టారు. ఈ మేరకు ప్రాజెక్ట్ కోసం సర్వే, భూసేకరణ మొదలుపెట్టారని చెబుతున్నారు అధికారులు.
దేశంలో బుల్లెట్ రైలు వ్యవస్థను తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ముంబై – అహ్మదాబాద్ కారిడార్‌లో పనులు ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాయి. 300 కిలోమీటర్ల వయాడక్ట్ పనులు పూర్తయ్యాయి. ఇది అందుబాటులోకి వస్తే దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గం కానుంది. ఇక ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-అహ్మదాబాద్, ముంబై-నాగ్‌పూర్, ముంబై-హైదరాబాద్, వారణాసి-హౌరా కారిడార్లలోనూ బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ కారిడార్లు పూర్తయితే దేశంలోని ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ఆర్థికాభివృద్ధికి మరియు ప్రాంతీయ అనుసంధానానికి ఎంతో దోహదపడుతుంది