విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పడడం అనేది ఆ ప్రాంత వాసుల దశాబ్దాల నాటి కల. రైల్వే జోన్ అయ్యేందుకు విశాఖకు అన్ని అర్హతలు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం చొరవ, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత రామ్మోహన్ నాయుడు ఉండడంతో విశాఖ రైల్వే జోన్ పనులు ఊపందుకున్నాయి. తాజాగా రామ్మోహన్ నాయుడు దీనికి సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు.
విశాఖ పట్నం కేంద్రంగా ఏర్పడే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించిన ఆఫీసులకు త్వరలోనే శంకుస్థాపన జరుగుతుందని రామ్మోహన్ నాయుడు సోమవారం స్పష్టం చేశారు. సోమవారం విశాఖపట్నం -రాయపూర్ (దుర్గ్) మధ్య నడిచే కొత్త వందేభారత్ రైలును విశాఖపట్నంలో రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. రైల్వే జోన్‌కు సంబంధించి గతంలో నెలకొన్న భూ సమస్యలు ఇప్పుడు పరిష్కారం అయ్యాయని.. రైల్వేకు ఆ స్థలం అప్పగించేశామని తెలిపారు. త్వరలోనే జోన్ కార్యాలయాల నిర్మాణ పనులు ప్రారంభించాలని రైల్వేమంత్రికి విజ్ఞప్తి చేశామని చెప్పారు.
బహుశా దసరా లేదా దీపావళి మధ్యలో ముహూర్తం చూసుకొని భవనాల శంకుస్థాపన చేస్తామని రైల్వే మంత్రి చెప్పినట్లుగా రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను కలిపేలా వందేభారత్‌ను నడపడం ఉత్తరాంధ్ర ప్రజలకు చాలా ఉపయోగకరం అని కేంద్రమంత్రి వెల్లడించారు. అనంతరం వందేభారత్ ట్రైన్ లో రామ్మోహన్ నాయుడు కొంతదూరం ప్రయాణించారు. ఎంపీలు శ్రీభరత్, బాబూరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, గణబాబు, డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర వాసుల డిమాండ్ కు తగ్గట్లుగా 2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు ఇందులో భాగంగా ఉంటాయి. అయితే, జోన్ హెడ్ క్వార్టర్ నిర్మాణం కోసం అప్పటి జగన్ సర్కారు ప్రభుత్వం భూములు కేటాయించింది. ముడసర్లోవ దగ్గర 52 ఎకరాలను రైల్వేశాఖకు జిల్లా యంత్రాగం అప్పగించింది. కానీ ఇప్పటివరకు రైల్వేజోన్ పనులకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడలేదు. జగన్ ప్రభుత్వం కేటాయించిన ఆ భూములు వివాదంలో ఉన్నాయని కేంద్రం చెబుతోంది. ఇలా వివాదంలో ఉన్న భూములను రైల్వే జోన్ భవనాల కోసం కేటాయించి.. జగన్ సర్కారు ఐదేళ్లుగా జాప్యం చేస్తూ వచ్చింది. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ భూముల వివాదాలను పరిష్కరించింది. దీంతో రైల్వే జోన్ భవనాల నిర్మాణాలకు మార్గం సుగమం అయింది.