ఏపీలో గత ఐదేళ్ల క్రితం వరకూ జగన్ మోహన్ రెడ్డి హాయాంలో గనుల శాఖలో అంతులేని అక్రమాలు జరిగాయనే ఆరోపణలు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టుకోవడమే కాకుండా.. ఇసుక కాంట్రాక్టుల విషయంలో విపరీతమైన అవకతవలకు పాల్పడ్డారు. ఇవన్నీ అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి హాయాంలో జరిగిన సంగతి తెలిసిందే. ఏపీలో ప్రభుత్వం మారే సమయంలోనే వీజీ వెంకట్ రెడ్డి తన అరెస్టును ముందే ఊహించి పరారీలోకి వెళ్లిపోయారు.
అయితే, అప్పటికే ఆయన్ను పోలీసులు వెతుకుతుండడంతో జల మార్గం ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లోనే భార్యతో కలిసి విజయవాడ నుంచి పెట్టె సర్దుకొని చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. అక్కడి నుంచి దేశం దాటి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, జూన్ 11న భార్యతో కలిసి షిప్ ఎక్కేసినట్లు తెలిసింది. ఆయన మాతృ సంస్థ ఇండియన్ కోస్ట్ గార్డ్ కావడంతో ఆ పరిచయాలతో సముద్ర మార్గం ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. సాధారణంగా దేశం విడిచి పోవాలంటే ఎయిర్‌పోర్టులపై అందరి ఫోకస్ ఉంటుంది కాబట్టి, జల మార్గం ద్వారా వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.
వెంకటరెడ్డిని ఏపీకి జగన్ రెడ్డి తన ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై రప్పించారు. ఏపీ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్‌గా మూడేళ్లపాటు పని చేయించుకున్నారు. అలా సుమారు రూ.3 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారు. అలా మైనింగ్‌లో ఘోరమైన ఉల్లంఘనలకు పాల్పడి రూ.2,856 కోట్ల ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తులకు దోచి పెట్టారు. మే 2021 నుంచి జూన్ 2024 వరకూ ప్రైవేటు ఏజెన్సీలు భారీగా ఇసుక తవ్వకాల్లో అగ్రిమెంట్ షరతులను ఉల్లంఘించాయి. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, సుప్రీం కోర్టు ఆర్డర్లను కూడా ఆయన ఉల్లంఘించారు.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుక తవ్వకాలు, మైనింగ్ అక్రమాలపై ప్రాథమిక నివేదిక తెప్పించుకుంది. దాని ఆధారంగా ఆయనను సస్పెండ్ చేసి పూర్తిస్థాయి ఏసీబీ విచారణకు గత ఆగస్టు 1న ఆదేశించింది. రంగంలోకి దిగిన ఏసీబీ.. గనుల శాఖలో అక్రమాల పుట్టను తొలిచి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వెంకట రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా ఆయన్ను అదుపులోకి తీసుకోవడం అసలు సాధ్యం కాలేదు. విజయవాడలోని మైనింగ్ గెస్ట్ హౌస్‌లో మూడేళ్లకు పైగా ఉన్న వెంకట రెడ్డి.. గత జూన్ 6న అక్కడున్న అటెండర్ రాజును మంగంపేటకు బదిలీ చేశారు. అంతకు ముందురోజు తన సామాన్లన్నీ వెంకటరెడ్డి ప్యాక్ చేసినట్లు ఏసీబీ అధికారులకు రాజు చెప్పారు. అటు హైదరాబాద్‌లో ఇల్లును రెండు నెలల క్రితమే ఖాళీ చేశారని.. కడప జిల్లాలోని ఆయన సొంతూరులోనూ ఇంటికి తాళం వేసి ఉండేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.