ఏపీలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుంటే వైసీపీ నేతలు పండగ చేసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు.ఏపీలో ఇప్పటి వరకు ఆక్సిజన్ అందక 76 మంది కరోనా రోగులు చనిపోయారని ఆయన గుర్తు చేశారు. ఇవాళ సాయంత్రం వారందరికి రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తులతో నివాళి అర్పించాలని పార్టీ శ్రేణులను కోరారు. ఆక్సిజన్ అందక విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో పది మంది రోగులు చనిపోయినప్పుడే ప్రభుత్వం కళ్లు తెరచి ఉంటే రుయా ఆసుపత్రిలో 25 మంది ప్రాణాలు కోల్పోయి ఉండే వారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రుయాలో ఏం జరిగిందో తెలుసుకోవాలని టీడీపీ, వామపక్షాల నేతలు వెళుతుంటే పోలీసులు అరెస్టులు చేశారని, కానీ వైసీపీ నేతలు మాత్రం దర్జాగా రుయా ఆసుపత్రిలో తిరిగి వచ్చారని చంద్రబాబు విమర్శించారు.
పొరుగు రాష్ట్రాలను చూసి నేర్చుకోండి
తమిళనాడు ప్రభుత్వం 400 టన్నుల నుంచి 1200 టన్నులకు ఆక్సిజన్ తయారీ,నిల్వ సామర్ధ్యాలను పెంచుకుందని కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.కేరళ, ఒరిస్సా రాష్ట్రాలు తమ అవసరాలు తీరగా మిగిలిన ఆక్సిజన్ పొరుగు రాష్ట్రాలకు అందిస్తున్నాయన్నారు. ముందుచూపు లేకపోవడం వల్లే ఏపీలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.కరోనా మృతులందరికి ఒక్కొక్కరికీ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన కూలీలు, ప్రైవేటు ఉపాధ్యాయులకు రూ.10వేల ఆర్థిక సాయం వెంటనే చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కరోనాపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.











