అన్నిరంగాలలో మాదిరిగా సినిమారంగంలోనూ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమా ప్రదర్శనలోనూ డిజిటల్ విప్లవం వచ్చిన సంగతి తెలియంది కాదు. గతంలో సినిమా ప్రదర్శన కోసం ఊరూరా థియేటర్లకు రీళ్లు వెళ్లేవి. వాటి స్థానంలో డిజిటల్ పద్ధతి రావడంతో రీళ్లు పంపించే విధానానికి కాలం చెల్లింది. శాటిలైట్ అనుసంధానంతో హైదరాబాద్, చెన్నై లాంటి కేంద్రాల నుంచి క్యూబ్, యూఎఫ్ ఓ, పిఎక్స్ డీ వంటి సంస్థలు నేరుగా థియేటర్లలో సినిమాను ప్రసారం చేస్తుంటాయి. అల్లు అరవింద్, డ్.సురేష్ బాబు, ప్రసాద్ ల్యాబ్ రమేష్ ప్రసాద్ వంటి వ్యక్తులు ఉన్నారు. వీరినే డిజిటల్ ప్రొవైడర్స్ అంటారు.
ఇలా థియేటర్స్ లో సినిమా ప్రదర్శన కోసం నిర్మాతలు కొంత మొత్తాన్ని డిజిటల్ ప్రొవైడర్స్ కు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా వారానికి ఒక థియేటర్ కు 12 వేల రూపాయల చొప్పున డిజిటల్ ప్రొవైడర్స్ వసూలు చేస్తుంటారు. ఈ లెక్కన రెండు తెలుగు రాష్ట్రాలలో, ఇంకా ఇతర ప్రాంతాలలో సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తే, అంత మొత్తాన్ని నిర్మాతలు చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ టెక్నాలజీ మంచిదే అయినా డిజిటల్ ప్రొవైడర్స్ వసూలు చేస్తున్న చార్జీలు మాత్రం చిన్న నిర్మాతలనే కాదు పెద్ద నిర్మాతలకు కూడా భారంగా పరిణమించాయని పరిశ్రమలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చాలాకాలంగా ఈ సమస్య పెండింగ్ లోనే ఉంది. ప్రొవైడర్స్ ను చార్జీలు తగ్గించమని ఎన్నో మార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం ఉండటం లేదని పలువురు నిర్మాతలు వాపోతున్నారు. వారానికి ఒక థియేటర్ కే 12 వేలు చెల్లించడం చాలా అన్యాయమని నిర్మాతలు అంటున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ప్రొవైడర్స్ చార్జీలు తగ్గించేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువురు నిర్మాతలు కోరుతున్నారు.
Must Read ;- ఇస్మార్ట్ హీరో నిరీక్షణ ఫలించేనా..?











