సినిమా థియేటర్ల ప్రారంభానికి సర్వం సిద్ధమైపోయింది. ఈ నెల 4వ తేదీ నుంచి సినిమా హాళ్లు ప్రారంభం కానున్నాయని ‘లియో న్యూస్’ ముందే చెప్పింది. మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ థియేటర్స్ ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మిగతా సినిమా హాల్స్ కూడా 4వ తేదీ నుంచి పున: ప్రారంభానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రదర్శనలు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 50 శాతం సీటింగ్, శానిటైజేషన్ లాంటి ముఖ్యమైన చర్యలన్నీ తీసుకుంటున్నారు.

అయితే కొత్త సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. ఇప్పటికే ఓటీటీలో విడుదలైన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త సినిమాల విడుదలకు ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. దానికి కారణం జనం నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందనేది కూడా ముఖ్యం. అందుకే ఈ విషయంలో నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. క్రిస్మస్ నాటికి సినిమా థియేటర్లలో పూర్తి స్థాయి సందడి కనిపించే అవకాశం ఉంది. సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించారు. అదే బాటలో మరికొన్ని సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ముఖ్యంగా ఈ నెలలో చిన్న సినిమాలు ఎక్కువగా విడుదలయ్యే అవకాశం ఉంది. జనవరి నుంచి పెద్ద సినిమాల సందడి ప్రారంభమవుతుంది. సినిమా థియేటర్ల ప్రారంభానికి ప్రభుత్వ పరంగా కూడా మద్దతు లభించడంతో నిర్మాతలు ఇక నుంచి ఓటీటీ విడుదలకు వెనుకంజ వేస్తున్నారు. లేకుంటే ఈపాటికే మరికొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలై ఉండేవి. అంతా బాగానే ఉన్నా జనం థియేటర్లకు వస్తారా అనే విషయంలో చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. మరో రెండు రోజుల్లోనే ఈ విషయంపై స్పష్టత కూడా వచ్చేస్తుంది. అంతవరకూ ఓటీటీలో సినిమాల కోసం ఎదురుచూడకుండా ఉంటేనే మంచిది.
Also Read:థియేటర్లలో సినిమాలకు వేళాయెరా











