హైదరాబాద్‌ను వ్యాపార కేంద్రంగా ఎంచుకుని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. ఇది శుభసూచికం. కరోనా విపత్కర సమయంలో హైదరాబాద్ కేంద్రంగా రూ.వేల కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణకు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెజాన్ వెబ్ సర్వీసెస్ తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు గానూ రూ.20,761 కోట్ల భారీ పెట్టుబడులను పెట్టిన విషయం తెలిసిందే. ముంబాయి తరువాత అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న నగరంగా హైదరాబాద్ ఖ్యాతి గడిస్తుందనడంలో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కోవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ పరిణామాల తరువాత అంతర్జాతీయ వ్యాపారాన్ని వెనక్కు నెట్టేశాయనే ప్రచారం బాగా జరిగింది. మెట్రో, వాణిజ్య నగరాల్లో పెట్టుబడులు పెట్టే పరిస్థితులు ఇక ఉండబోవనే చర్చ సైతం అంతర్జాతీయ వేదికగా జరిగింది. అందులోనూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండవ దేశంగా ఉన్న భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే దిగ్గజకంపెనీలు ముందుకు రావనే అపోహా ఉండేది. కానీ అన్‌లాక్ తరువాత దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెజాన్ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ కరోనా నేపథ్యంలో రూ. 20,761 కోట్ల విదేశీ పెట్టుబడులు పెట్టడమనేది మామూలు విషయం కాదు. వ్యాపారాలను విస్తరించేందుకు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం మంచి పరిణామంగా చూడాల్సి ఉంది.
Also Read ;- కరోనా వ్యాక్సిన్: గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్
బ్రాండ్ అంబాసిడర్..
అంతర్జాతీయ పెట్టుబడులను హైదరాబాద్‌కు తీసుకురావడంలో గత ప్రభుత్వాల దూరదృష్టితో పాటు ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలే కూడా ఒక కారణం. అమెజాన్ వెబ్ సర్వీస్ రాష్ట్రంలో రూ.20,761 కోట్ల పెట్టుబడులు పెట్టేందరు ముందుకు రావడం ఆ సంస్థతో మంత్రి కేటీఆర్ పలు దఫాలుగా జరిపిన చర్చలు సఫలం కావడమే. హైదరాబాద్‌లో అపారమైన మానవ వనరు, నైపుణ్యం వ్యాపారులకు భరోసానిస్తోంది. పరిశ్రమల అనుమతుల జారీలో సత్వర పరిష్కార విధానాలను ప్రభుత్వం చేపడుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు విస్తారమైన రహదారి కనెక్టివిటీ కలిగిఉంది. అన్నిరకాల మౌళికసదుపాయాలు హైదరబాద్ నగరంలో ఉన్నందునే పెట్టుబడులకు ఇది దిక్సూచిగా నిలుస్తూ పెట్టుబడులకు కేంద్రంగా నిలుస్తోంది. పదుల సంఖ్యలో అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ఇప్పటికే కొనసాగిస్తున్నాయి. ఇటీవల ఫ్లిప్ కార్ట్ కూడా డేటా సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్, డెలాయిట్ తదదితర అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ బిజినెస్ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రం ఫార్మాసిటీ హబ్ గా మారుతోంది. గడిచిన కొన్నేళ్లల్లో ఈ రంగంలో రూ.10వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. అలాగే బెంగుళూరు కంటే సమానంగా ఐటీ పరిశ్రమలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 2019-2020లో ఐటీ ఎగుమతులు రూ.1.28వేల కోట్లకు చేరుకున్నాయి. భవిష్యత్‌లో కూడా మరిన్ని మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read ;- వాక్సిన్ శుభవార్తలతో స్టాక్ మార్కెట్ పరుగులు!