జగన్ సర్కారు పాలనలో ఓటు హక్కు పొందడానికి కూడా హైకోర్టు వరకూ వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి సొంత ఊళ్లో ఓటు హక్కు కోసం ఏళ్ల తరబడి న్యాయ పోరాటం చేయాల్సి రావడం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కనిపించే దురదృష్టకర పరిణామం. విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఎదురైన చేదు అనుభవం ఇది.
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్.. పంచాయితీ ఎన్నికల విషయంలో జగన్ సర్కారుతో విభేదించారు. కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చిలో పంచాయితీ ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేయాలని నిర్ణయించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అప్పటి ఆ పదవి చేపట్టి మూడు సంవత్సరాలు కావడంతో, ఇన్‌డైరెక్టుగా ఆయన్ని తొలగించినట్లు అయింది. ఆయన స్థానంలో రిటైర్డ్ జడ్జ్ కనగరాజ్‌ను కొత్త ఎస్‌ఈసీగా నియమిస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.
తన పదవీ కాలం కుదించడం రాజ్యాంగ విరుద్ధమని హోకోర్టుకు వెళ్లిన నిమ్మగడ్డ రమేశ్.. జగన్ సర్కారుపై విజయం సాధించారు. దీంతో జగన్ ప్రభుత్వం మరోసారి ఆయన్నే ఎస్‌ఈసీగా నియమించక తప్పలేదు. తర్వాత కాలంలో కరోనా వ్యాక్సినేషన్ కోసం పంచాయితీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరినా ఆయన అంగీకరించలేదు. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఆ విధంగా అప్పట్లో జగన్ సర్కారుపై విజయం సాధించారు నిమ్మగడ్డ రమేశ్.
1982 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్వగ్రామం.. గుంటూరు జిల్లా దుగ్గిరాల. రిటైర్ అయిన తర్వాత సొంత ఊర్లో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ ఊళ్లో నివాసం ఉండటం లేదనే కారణంతో దుగ్గిరాలలో ఓటు హక్కు కల్పించేందుకు నిరాకరించారు అధికారులు. ప్రభుత్వం నిర్ణయంపై న్యాయ పోరాటం ప్రారంభించారు నిమ్మగడ్డ రమేశ్. 2021లో హైకోర్టును ఆశ్రయించారాయన. దుగ్గిరాలలో తనకు ఇల్లు, ఆస్తులు ఉన్నాయని, తన తల్లి కూడా ఆ ఊళ్లోనే ఉంటున్నారని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు ఈ ఏడాది జులైలో ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఓటు కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఆయనకు న్యాయస్థానం సూచించింది. ఆయన అప్లికేషన్‌పై నిర్దిష్ట సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది హైకోర్టు. తాజా విడుదలైన ఓటర్ల జాబితాలో.. దుగ్గిరాల గ్రామంలో నిమ్మగడ్డ రమేశ్ వివరాలు కనిపించాయి. దీంతో మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విజయం సాధించారు.











