ప్రాజెక్టు ప్రారంభం నుంచే వ్యతిరేకించారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పగబట్టారు.. అధికారంలోకి రాగానే పక్కన పెట్టారు. నాలుగేళ్లు మోటార్లు కూడా ఆన్ చేయకుండా మూలన పడేశారు. ఇదీ పట్టిసీమ ఎత్తిపోతల పథకం విషయంలో సీఎం జగన్ మొదటి నుంచి అనుసరిస్తూ వస్తున్న వైఖరి. ఇన్నేళ్ల నుంచి వైసీపీ నాయకుడు అంతగా ద్వేషించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే.. కరువు కాలంలో కల్పతరువులా మారింది. 15 లక్షల ఎకరాల ఆయకట్టును ఆపద నుంచి గట్టెక్కిస్తోంది. వర్షాలు మొహం చాటేసిన సమయంలో పట్టిసీమపై ఆధారపడక తప్పని పరిస్థితులు రావడానికి.. జగన్ సర్కారు రివర్స్ విధానాలే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు.
నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ.. అప్పటి సీఎం చంద్రబాబు నాయకత్వంలో నదుల అనుసంధానానికి ప్రాధ్యాన్యత ఇచ్చింది. గోదావరి జలాలను తరలించడం ద్వారా.. కృష్ణా డెల్టాలో.. సాగునీటి కొరత, కరువు అనే మాటే లేకుండా చేయాలని సంకల్పించింది గత ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు ద్వారా 90 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించి విజయవాడ దగ్గరున్న ప్రకాశం బ్యారేజీకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేశారు. జాతీయ ప్రాజెక్టు హోదా దక్కినా కూడా పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. అందుకే పోలవరం అందుబాటులోకి వచ్చేవరకూ ఆగకుండా.. కృష్ణా డెల్టా ఆయకట్టుకు గ్యారెంటీగా సాగునీరు అందించడానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించాలని నిర్ణయించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పట్టిసీమను వ్యతిరేకించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగా పట్టిసీమ ఎందుకు దండగ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం భయపడినట్లే.. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు. ఈలోగా ప్రభుత్వం మారింది. అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి అవ్వగానే రివర్స్ టెండర్ల పేరుతో పోలవరం నిర్మాణం ఆపేశారు. ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం వద్దని చెప్పినా వినకుండా రివర్స్ రూట్‌లోనే వెళ్లారు సీఎం జగన్. టెండర్లు పూర్తయి కొత్త కాంట్రాక్టర్ పనులు ప్రారంభించే సమయానికి వరదలు ముంచెత్తాయి. అదే సమయంలో కరోనా విజృభించింది. వరదల వల్ల అప్పటికే నిర్మాణ పూర్తయిన డయాఫ్రం వాల్, ఎగువ కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నాయి. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటిపోయింది. పోలవరం ప్రాజెక్టు మాత్రం జగన్ సీఎం అయ్యే నాటికి ఉన్న పరిస్థితి కంటే చాలా వెనక్కి పోయింది. ఇప్పుడు చాలా పనులు మళ్లీ చేయాల్సి వస్తోందని తేల్చేశారు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు.
పోలవరం ప్రాజెక్టును నిండా ముంచేసిన వైసీపీ ప్రభుత్వం.. పట్టిసీమను కూడా పక్కన పెట్టేసింది. అయితే ఈ ఏడాది అనుకోని ఉపద్రవం వచ్చి పడింది. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో చూడనంత వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా బేసిన్‌లో ఏ ప్రాజెక్టులోనూ నీళ్లు లేవు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరు అందించాలంటే.. పట్టిసీమ మోటార్లు మళ్లీ రన్ చేయక తప్పని పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ముందుచూపుతో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకమే.. నేడు కృష్ణ డెల్టాలో పంటలకు ఆధారమైంది. వైసీపీ ప్రభుత్వాన్ని ఆపద్భాందవుడిలా ఆదుకొంది. జగన్ సర్కారు మొండి పట్టుదల పట్టిసీమ ప్రవాహంలో కొట్టుకుపోయింది. వచ్చే ఎన్నికల్లో ఇదే అంశం జగన్‌ను ముంచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
పట్టిసీమ విషయంలో సీఎం జగన్ చేసిన తప్పులు ఆయన్ను వెంటాడటం ఖాయం. ప్రతి ఎకరానికీ సాగునీరు అందించడానికి పొరుగు రాష్ట్రాలు లక్షల కోట్లు ఖర్చుపెడుతుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం బటన్ నొక్కి జనానికి పది వేలో, పాతిక వేలో పంచి పెడతే చాలు అనుకొంటోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, ఏం కోల్పోయింది అనే విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.