సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో విద్యనభ్యసించిన బడుగు, బలహీన వర్గాల విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి.. వారి కుటుంబాల్లో ఓ వెలుగు నింపే దిశగా గురుకులా సొసైటీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాపించిన సంస్థ స్వేరోస్. ప్రత్యేకించి దళిత సామాజిక వర్గానికి చెందిన పిల్లలే ఈ సంస్థలో అధికంగా ఉన్నారన్న వాదనలూ లేకపోలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ ఏ ఆశయంతో అయితే ఈ సంస్థను ప్రారంభించారో గానీ.. ఆ ఆశయ సాధన దిశగా పయనించే క్రమంలో స్వేరోస్ పలు వివాదాల్లోనూ చిక్కుకుంది. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే..స్వేరోస్ సభ్యులే ఆ సంస్థ సృష్టికర్త అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ముంచేసే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
గాదరికి స్వేరోస్ బెదిరింపులు
ఐపీఎస్ సర్వీస్ కు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ మూడు రోజుల క్రితం బీఎస్పీలో చేరిపోయారు. ఈ సందర్భంగా నల్లగొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రవీణ్.. కేసీఆర్ సర్కారును విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చిన తుంగుతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్.. ఆర్ఎస్ ప్రవీణ్ తీరుపై విరుచుకుపడ్డారు. అంటే.. ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపణలు గుప్పించాకే.. వాటికి కౌంటర్ గా గాదరి కిశోర్ కామెంట్లు చేశారనే చెప్పాలి. ఈ క్రమంలో గాదరి కిశోర్ కు స్వేరోస్ సభ్యుడిగా చెప్పుకున్న సంపత్ అనే వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. ‘‘ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విమర్శించే మొనగాడివా? మరోమారు ఆర్ఎస్ ప్రవీణ్ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు’’ అంటూ గాదరికి సంపత్ వార్నింగ్ ఇచ్చారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్ కు సంబంధించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
స్వేరోస్ పై గతంలోనూ వివాదాలు
స్వేరోస్ సంస్థ చేపట్టిన పలు కార్యక్రమాల్లో స్వయంగా పాలుపంచుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ స్వేరోస్ సభ్యులతో ప్రమాణం చేయించిన వైనం గతంలోనే వివాదాలు రేపింది. ఈ ప్రమాణాల్లో హిందూ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని, వాటిని తక్షణమే తొలగించాలని కూడా పలు సంఘాలు డిమాండ్ చేశాయి. అంతేకాకుండా స్వేరోస్ పేరిట ఆర్ఎస్ ప్రవీణ్ ఏర్పాటు చేసిన సంస్థ సమాజంలో అసమానతలను చూపించి అగ్రవర్ణాలను దోషులుగా చూపించే యత్నం చేస్తోందన్న ఆరోపణలు కూడా వినిపించాయి. తాజాగా ఇప్పుడు ప్రవీణ్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తే.. ఏకంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకే బెదిరింపు కాల్స్ వస్తున్న వైనం మరింత మేర వివాదాస్పదం అయ్యే ప్రమాదం లేకపోలేదు. అంటే.. తనను ఏర్పాటు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను స్వేరోస్ ముంచేయడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- బీఎస్పీలో చేరిన ఆర్ఎస్పీపై దాడి షురూ











