Special Story On Dilip Kumar :
మేఘాలు వచ్చివెళుతుంటాయి .. కానీ ఆకాశం ఎప్పటికీ ఉంటుంది. కాలాలు మారుతుంటాయి .. కానీ సూర్యచంద్రులు ఎప్పటికీ నిలిచి ఉంటారు. అలాగే వెండితెరపై ఎవరు ఎంతకాలం రాజ్యం చేసినా, నటన పరంగా దిలీప్ కుమార్ వేసిన ముద్ర చెదరకుండా అలాగే ఉంటుంది.
దిలీప్ కుమార్ .. ఒక పేరు కాదు .. ఒక అభినయ అస్త్రం .. అది ప్రేక్షకుల హృదయాలపై ప్రయోగించబడి చాలాకాలమే అయింది. ఇప్పటికీ అది తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. చిన్ని చిన్ని కళ్లతో .. నిర్మల మైన నవ్వుతో .. నిర్వచనానికి అందని అభినయాన్ని ఆవిష్కరించిన అరుదైన కథానాయకుడు ఆయన. నవరసాలను ప్రేక్షకుల మనసు పాత్రలో వడ్డించిన తిరుగులేని నటుడు ఆయన. దిలీప్ కుమార్ పేరును ప్రస్తావించకుండా బాలీవుడ్ సినిమా చరిత్రను చెప్పుకోవడం అసాధ్యం .. అది ఎవరూ కాదనలేని సత్యం.
1940 ద్వితీయార్థం నుంచి కథానాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం అప్రతిహతంగా సాగింది. ఆ తరం నటులకు ఆయన ఒక స్ఫూర్తి. ఆ తరువాత తరాలవారికి ఆయన ఒక పుస్తకం. పోటీని తట్టుకోలేక పారిపోయేవారు తప్పకుండ చదువుకోవలసిన పాఠం. ఒక ఆర్టిస్ట్ తాను డైలాగ్స్ చెబుతున్నప్పుడు ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం తేలికే .. అవతల పాత్ర డైలాగ్స్ చెబుతున్నప్పుడు ఆ అర్థానికి తగినట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడమే చాలా కష్టం. ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్ లోని లోపాలు బయటపడేది కూడా ఇక్కడే. ఆర్టిస్టులు ఇక్కడే పాస్ మార్కులు తెచ్చుకోవలసి ఉంటుంది.
నిజమైన నటుడు ‘కట్’ చెప్పేవరకూ పాత్రలో నుంచి బయటికి రాడు .. తెరపై ఆ సన్నివేశాన్ని చూస్తున్న ప్రేక్షకుడిని ఆ దృశ్యంలో నుంచి బయటికి రానీయడు. నటనంటే తన పాత్ర .. తనచుట్టూ ఉన్న పాత్రలను దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ చెప్పడం కాదు. ఆ పాత్రలతో పాటు పరిసరాలను ఆ సన్నివేశంలోకి తీసుకోవాలి .. అక్కడి ప్రకృతిని ఆ సన్నివేశంలోకి ఆవాహన చేయాలి. అప్పుడే ఆ సన్నివేశం సహజంగా ఆవిష్కృతమవుతుందని నమ్మిన నటుడు దిలీప్ కుమార్. అందుకే ఆయన అభినయం అనుభూతి ప్రధానంగా కనిపిస్తుంది. ఎల్లలు ఎరుగని నటుడిగా ఇప్పటికీ ఆయన పేరే వినిపిస్తోంది.
తెరపై కనిపించే ఏ పాత్ర అయినా ప్రేక్షకుల చూపుల నుంచి తప్పించుకోలేదు. అందువల్లనే పాత్రలో జీవం ఉందా? లేదా? అనే విషయం వాళ్లు వెంటనే గ్రహించేస్తారు. కథ .. నిజమని ప్రేక్షకులు అనుకోవాలంటే, ఆ కథలో వాళ్లను భాగస్వాములను చేయాలంటే పాత్రలలో నటులు ఒదిగిపోవాలి .. తేనెలో తీపిలా ఇమిడిపోవాలి. దిలీప్ కుమార్ నటించిన ఏ పాత్రను పరిశీలించినా ఇదే విషయం అర్థమవుతుంది. ఆయన అంతగా జనాదరణ పొందడానికిగల కారణం స్పష్టమవుతుంది.దిలీప్ కుమార్ తొలి సినిమా ‘జ్వార్ భాటా’ పరాజయం పాలైనా ఆయనేం కుంగిపోలేదు. ఓటమిని వాయిదా వేయబడిన గెలుపు మాదిరిగానే ఆయన భావించాడు. అదే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాడు.
అప్పట్లోనే ఆయన తనదైన హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చేయడం .. ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ను ఆవిష్కరించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దిలీప్ కుమార్ నడకలోని ప్రత్యేకత .. కనుబొమలు ఎగరేస్తూ డైలాగ్స్ చెప్పే తీరు .. కళ్లు చిట్లిస్తూ .. పెదాలను విరుస్తూ భావాలను ఆవిష్కరించే విధానానికి ఎంతోమంది అభిమానులు అయ్యారు. ముఖ్యంగా డైలాగ్స్ కన్నా ఎక్స్ ప్రెషన్స్ కి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. కథాకథనాలతో పాటు పాటల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. అందువల్లనే ఆయన పాటల్లో అధికశాతం సూపర్ హిట్లే ఉంటాయి. కథ ఏదైనా .. పాత్ర ఎలాంటిదైనా ఆయన అభిమానుల నుంచి రెండే మాటలు బయటికి వచ్చేవి .. అవే .. అద్భుతం – అసమానం.
50 దశకంలో దిలీప్ కుమార్ (Dilip Kumar) చేసిన ‘దీదార్’ .. ‘అమర్’ .. ‘దేవదాస్‘ .. ‘మధుమతి’ చిత్రాలు ఆయనలోని విలక్షణ నటనకు అద్దం పడతాయి .. అర్థం చెబుతాయి. ఆయన పోషించిన ఆ తరహా పాత్రల కారణంగానే ‘ట్రాజెడీ కింగ్’ అంటూ అభిమానులు పిలుచుకున్నారు. ఇక 60 వ దశకం ఆరంభంలో వచ్చిన ‘మొఘల్ ఎ ఆజమ్’ దిలీప్ కుమార్ కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచింది. సలీమ్ – అనార్కలి అమరప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన అభినయాన్ని అభిమానులు ఒక తీపిజ్ఞాపకంగా గుండె అరల్లో .. మనసు పొరల్లో దాచుకున్నారు.
స్టార్ హీరోగా దిలీప్ కుమార్ ఒక వెలుగు వెలుగుతున్న కాలంలోనే ఆయన ‘సైరాభాను’తో ప్రేమలో పడ్డారు. అప్పటికే ఆమె కోల కళ్లతో కుర్రకారును ఊరిస్తూ, నీరాజనాలు అందుకుంటోంది. దిలీప్ కుమార్ – సైరాభాను ప్రేమ .. పెళ్లిపీటల వరకూ వెళ్లింది. అభిమానులంతా ఆశించినట్టుగానే వాళ్లిద్దరూ ఒకటయ్యారు. అందాల జంటగా .. అన్యోన్య దంపతులుగా అభినందనలు అందుకున్నారు.
దిలీప్ కుమార్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ‘కోహినూర్’ .. ‘గంగ జమున’ .. ‘లీడర్’ .. ‘రామ్ ఔర్ శ్యామ్’ ..’సంఘర్ష్’ .. ‘ దిల్ దియా దర్ద్ లియా’ వచ్చి చేరాయి. వైవిధ్యభరితమైన ఆ చిత్రాలతో ఆయన అఖండ విజయాలను అందుకున్నారు. ఆ తరువాత ఆయన ఎన్నో మల్టీస్టారర్ సినిమాల్లోను ఊత్సాహంగా నటించారు. దర్శక నిర్మాతగానూ కొన్ని ప్రయోగాలు చేశారు. రాజకీయాల్లో ప్రవేశించి నాయకుడిగా తనవంతు సేవలను సమాజానికి అందించారు.
ఇలా నిలువెత్తు నటనకు నిర్వచనమై .. వ్యక్తిత్వం విషయంలో అజరామరమై నిలిచారు. ఈ కారణంగానే దిలీప్ కుమార్ ను పద్మభూషణ్ .. పద్మవిభూషణ్ .. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు సత్కరించుకున్నాయి. వెండితెరపై .. అభిమానుల గుండె తెరపై పదిలంగా నిలిచిన ఆయన స్థానానికి మరింత వన్నె తెచ్చాయి.
– పెద్దింటి గోపీకృష్ణ
Must Read ;- మకుటాయమానం దిలీప్ ‘మొఘల్-ఏ- ఆజమ్’