జక్కన్న అని చెప్పినా.. దర్శకధీరుడు అని చెప్పినా.. ఠక్కున గుర్తుకువచ్చే పేరు రాజమౌళి. అపజయం ఎరుగని వీరుడిలా వరుసగా విజయాలు సాధిస్తూ.. తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప దర్శకుడు.
బాహుబలి సినిమాతో బాలీవుడ్ మాత్రమే కాకుండా.. హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూసేలా చేసిన గొప్ప మేధావి. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే మక్కువ ఎక్కువ. అందుకనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకుండానే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి విజయేంద్రప్రసాద్, కజిన్ కీరవాణి సినిమా రంగంలో ఉండడంతో ఇంటర్మీడియట్ కంప్లీట్ అవగానే ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద అసిస్టెంట్ గా కెరీర్ ను ప్రారంభించారు. విజయం సాధించాలంటే ఓర్పు ఉండి తీరాల్సిందేనని చిన్న వయసులోనే పసిగట్టిన ముందు చూపు ఉన్నోడు.
అందుకనే సుమారు ఆరేళ్ల పాటు ఏవీఎం రికార్డింగ్ థియేటర్ లో పని చేయడం.. తండ్రి అడుగు జాడల్లోనే సినిమా రచనకు సంబంధించిన పాఠాలు నేర్చుకోవడం రాజమౌళి విజయాలకు పరోక్షంగా కారణాలయ్యాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ కమిటీ ఛైర్మన్ గా నియమించిన సందర్భంలో రాజమౌళి గడించిన అనుభవం విశేషమైంది. రాజమౌళిని ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా ప్రభుత్వం తరఫున నియమించారు. అప్పుడే రాఘవేంద్రుడు శాంతి నివాసం సీరియల్ ప్రొడ్యూసర్ గా మారి రాజమౌళికి డైరెక్టర్ బాధ్యతలు అప్పజెప్పారు.
స్టూడెంట్ నంబర్ వన్ నుంచి డైరెక్టర్ నంబర్ వన్
అలా.. అలా.. బుల్లితెర నుంచి పై పైకి ఎదిగి స్టూడెంట్ నెం 1 సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు. స్టూడెంట్ నెం 1 సినిమా విజయం సాధించగానే.. రాజమౌళితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కూడా మారిపోయింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమా తీసి సంచలనం విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించడంతో పాటు ఎక్కువ కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడిన చిత్రంగా సింహాద్రి చరిత్ర సృష్టించింది. దీంతో ఎన్టీఆర్ ఇమేజ్ పెరగడంతో పాటు రాజమౌళికి డిమాండ్ బాగా పెరిగింది.
హీరోలు, నిర్మాతలు రాజమౌళితో సినిమా చేసేందుకు క్యూకట్టారు కానీ.. ఆదరాబాదరాగా సినిమాలు తీసి ఎక్కువ సినిమాలు తీశానన్న బిరుదు అక్కర్లేదనుకుని.. ఏడాదికి ఒక సినిమా తీసినా గొప్ప విజయం సాధించే సినిమా తీయాలనుకున్నారు. చత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ.. ఇలా వరుసగా విజయాలు సాధించిన జక్కన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన సినిమా మగధీర. ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది.
కాల భైరవుడిగా రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ చిత్రంతో తన స్టామినాను రాజమౌళి మరోసారి నిరూపించుకున్నారు. అంతేకాదు… తెలుగు సినిమా మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. మర్యాదరామన్న, ఈగ, బాహుబలి, బాహుబలి 2.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తూ… చరిత్ర సృష్టించారు.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు ఇదిలా ఉంటే… తను తెరకెక్కించే ప్రతి సినిమాతో చరిత్ర సృష్టిస్తున్న రాజమౌళి కొడుకు పేరు కార్తికేయ అని తెలుసు. మరి. రాజమౌళి కుమార్తె పేరు తెలుసా.. ఆమె పేరు ఏంటంటే.. మమూఖ. ఆమె గురించి రాజమౌళి బయటకు చెప్పడం మయూఖకు అసలు ఇష్టం ఉండదట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి చెప్పారు. బాహుబలితో చరిత్ర సృష్టించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీతో మరోసారి చరిత్ర సృష్టించడం ఖాయం అంటున్నారు సినీ పండితులు.
Must Read ;- ఆర్ఆర్ఆర్ షూట్ స్టార్ట్.. జక్కన్న ప్లాన్ అదే?











