మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో రెండు ప్రధాన ప్యానల్స్ మధ్య అంతర్గత రాజకీయాలు ఎక్కువైనట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న బండ్ల గణేశ్ పోటీ నుంచి విరమించుకుని ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు పలికారు. ఈ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి బండ్ల గణేష్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆయన తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లతో తన ఇంట్లో దిగిన ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. మరి గణేష్ మీద ఎలాంటి ఒత్తిడి పనిచేసిందో తెలియదు. ఇక ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి మంచు విష్ణు, నటుడు ప్రకాష్ రాజ్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే.
ప్రకాష్ రాజ్ ప్యానల్ ను ఏదో ఒక విధంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలను మంచు విష్ణు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ ను మొదట ప్రకటించినప్పుడు అందులో రాజారవీంద్ర కూడా ఉన్నారు. ఆ తర్వాత ప్పుకున్నారు. దీనికి కారణం మోహన్ బాబు నుంచి వచ్చిన ఒత్తిడేనని తెలిసింది. ఇలా ఇంకొందరిపై మంచు విష్ణు ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు సమాచారం. మా అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా ఇరువర్గాలూ భావిస్తున్నాయి. సభ్యులందరికీ ఫోన్లు చేసి తమకే ఓటు వేయాల్సిందిగా ఇరు వర్గాల వారూ కోరుతున్నారు.
సురేష్ కొండేటిని బందిపోటుగా వర్ణించిన విష్ణు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో ఓ జర్నలిస్టు అయిన సురేష్ కొండేటి చేరి అసోసియేషన్ ను భ్రష్టు పట్టిస్తున్నారని మంచు విష్ణు ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. అతను ఓ డెకాయిట్ గా అభివర్ణించారు. అసోసియేషన్ లో రాజకీయ లుకలుకలకు సురేష్ కొండేటి కారణమని ఆరోపణలను గుప్పించారు. జర్నలిస్టు మా సభ్యుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. జర్నలిస్టులు అంటే తనకు గౌరవం ఉందనే విష్ణు ఈ రకమైన ఆరోపణలు చేయడంతో కొందరు విస్తుపోయారు.
https://twitter.com/ganeshbandla/status/1443862947747418114
ఓ జర్నలిస్టును బందిపోటు అనడం ఎంతవరకు సమంజసమని కొందరు ప్రశ్నిస్తున్నారు. తాను మా సభ్యత్వానికి అనర్హుడినని విష్ణు ఆరోపించడాన్ని సంతోషం పత్రిక అధిపతి, నటుడు అయిన సురేష్ కొండేటి కూడా ఆక్షేపిస్తున్నారు. విష్ణు సినిమాల్లోకి రాకముందే తాను సినిమాల్లో నటిస్తూ వచ్చానన్నారు. తాను జర్నలిస్టునైనా నటుడిగా అర్హత ఉండబట్టే తనకు మా సభ్యత్వం లభించిందన్నది సురేష్ వివరణ. మంచు విష్ణు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని ప్రకాష్ ప్యానల్ కూడా తీవ్రంగా తీసుకున్నట్టు సమాచారం. దీన్ని మీడియా ముఖంగా ఖండిస్తూ ప్రకటన చేయడానికి ఆ ప్యానల్ సిద్ధమవుతోంది.
Must Read ;- చంద్రబాబుతో మంచు విష్ణుకు ఎలాంటి బంధుత్వం?











