’మా’ ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున పోటీపడుతున్న అభ్యర్థులెవరెవరు అన్నది స్పష్టమైంది. విష్ణు ప్యానల్ అభ్యర్థుల పేర్లు పూర్తిగా రావలసి ఉంది. ఇక అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా సీవీఎల్ నరసింహారావు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థుల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. అందులో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున నటి హేమ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడబోతున్నారు. హేమకు సంబంధించిన సమగ్ర వివరాలివి.
ఉపాధ్యక్ష బరిలో హేమ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉపాధ్యక్ష పదవికి హేమ పోటీ పడుతున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున నలుగురు మహిళలు పోటీపడుతున్నారు. జీవితా రాజశేఖర్, హేమ, అనితా చౌదరి, ప్రగతి ఈ ప్యానల్ లో ఉన్నారు. కోనసీమ ప్రాంతం నుంచి కళారంగంలో అడుగుపెట్టిన మహిళ ఆమె. అసలు పేరు కృష్ణవేణి. వెండితెర పేరు హేమ.
1975 నవంబరు 12న జన్మించారు. సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు. ఆమె తండ్రి పేరు కోళ్ల కృష్ణ, తల్లి పేరు కోళ్ల లక్ష్మి. భర్త పేరు జాన్ అహ్మద్. ఆమెకు ఒక పాప. పేరు ఇషా జాన్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 509 చిత్రాల్లో నటించారు. 1989లో బలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ‘కొండపొలం’ వరకూ ఆమె 509 చిత్రాల్లో నటించారు. మూడు టీవీ సీరియల్స్ లోనూ నటించారు.
మా ఎన్నికల బరిలోకి నాలుగో సారి
మా ఎన్నికల్లో ఆమె బరిలోకి దిగడం ఇది నాలుగోసారి. మొదటిసారి మా అసోసియేషన్ లో కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా ఎంపికయ్యారు. గత ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి 225 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈసారి ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.
స్వతహాగా ఆమెకు రాజకీయాలన్నా, సేవా కార్యక్రమాలు చేపట్టడం అన్నా ఆసక్తి ఎక్కువ. 2014 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట నియోజక వర్గం నుంచి సమైక్యాంధ్ర పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్సార్ పార్టీలో చేరారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. క్లుప్తంగా ఇదీ నటి హేమ నేపథ్యం. మా అసోసియేషన్ లో ఈమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరుంది.
Must Read ;- ‘మా’ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల