Tug Of War Between Prakash And Manchu Vishnu :
‘మా’ విందు రాజకీయాలు పసందుగా నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న తన సన్నిహితులకు నటుడు ప్రకాష్ రాజ్ విందు ఇచ్చారు. దాని మీద బండ్ల గణేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. మా కళాకారులకు విందులు, సన్మానాలు చేయొద్దని అన్నారు. కరోనా కాలంలో ఇలాంటివి పనికిరావన్నారు. ఓట్టు కావాలంటే అభివృద్ధి పనుల గురించి మాత్రమే మాట్లాడాలని అన్నారు. అయితే ప్రకాష్ రాజ్ పోటీ ప్యానల్ నేత మంచు విష్ణు కూడా తక్కువ తినలేదు. తిన్నవారికి తిన్నంతగా ఆయన కూడా పసందైన విందు ఇచ్చినట్టు తెలిసింది. రాత్రి పార్క్ హయత్ హోటల్ లో మా సభ్యులకు డిన్నర్ మీట్ ఏర్పాటుచేశారు.
మా అభివృద్ధికి ఏంచేయాలి? భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? లాంటి విషయాలను చర్చించేందుకే ఈ డిన్నర్ పార్టీ అంటున్నారు. మంచు విష్ణు ఇచ్చిన డిన్నర్ పార్టీకి నటుడు బాబూ మోహన్ కూడా హాజరైనట్టు తెలిసింది. ఈసారి ఎన్నికల్లో బాబూ మోహన్ కూడా పోటీ చేయబోతున్నారన్న వార్తలు వచ్చాయి. బహుశా విష్ణు ప్యానల్ లో బాబూ మోహన్ ఉంటారా? లేక మద్దతు తెలుపుతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే నటుడు కోట శ్రీనివాసరావు కూడా మంచు విష్ణు పార్టీకి హాజరైనట్టు తెలిసింది.
అంతకుముందు ప్రకాష్ రాజ్ కూడా పార్టీ ఏర్పాటుచేశారు. జేఆర్సీ కన్వెన్షన్ లో నటీనటులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తన ప్యానల్ గెలిస్తే రూ. 10 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. అక్టోబరు 10న ఎన్నికలు జరగనుండటంతో ఇరువర్గాల వారూ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో దాదాపు 900 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో మహా అయితే దాదాపు 500 ఓట్లు మాత్రమే పోలయ్యే అవకాశం ఉంది.
ఈ ఎన్నికలకు మీడియా కూడా ఇంతగా ప్రాధాన్యం ఎందుకిస్తుందో అర్థం కావడం లేదు. ప్రతిసారీ మా ఎన్నికల విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ప్రకాష్ రాజ్ కొంతమంది ప్రముఖులను పిలిచి స్టార్ హీరోలపై కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. వారు తమ వ్యక్తిగత కారణాల వల్ల ఎన్నికలకు దూరంగా ఉంటున్నారని ప్రకాష్ రాజ్ అన్నట్టు సమాచారం. ఇక నుంచి వారంతా మా వ్యవహారాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఓటు వేయడానికి స్టార్ హీరోలంతా తప్పనిసరిగా రావాలని, అది వారి బాధ్యత అని అన్నట్టు తెలుస్తోంది. కొంతమంది మా సభ్యులు మాత్రం తమను ఎవరూ సంప్రదించడం లేదని వాపోతున్నారు. ఒక్క ప్యానల్ వారు మాత్రమే తమకు ఫోన్ చేసి మాట్లాడారని, తాము వేరే ప్యానల్ వైపు మొగ్గిచూపినా వారు ఫోన్ చేయకపోవడంతో తమతో మాట్లాడిన వారి వైపే తాము ఉంటున్నామని తెలిపారు. మొత్తానికి రెండు ప్యానల్స్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నాయి.