జేసీ బ్రదర్స్ ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు. ఆ నవ్వులతో పాటే వివాదాలు కూడా. సరికొత్త వివాదాలను సృష్టించడంలో వాటిని పెంచి పోషించడంలోనూ జేసీ బ్రదర్స్‌ను మించిన వారు లేరనే చెప్పాలి. ఇదేదో అదాటుగా చెబుతున్న మాట కాదు. రాయలసీమ ప్రాజెక్టులు నిరాదరణకు గురవుతున్న తీరుపై టీడీపీ సీమ నేతలు కలిసి చర్చించుకుంటూ ఉంటే.. ఆ వేదిక వద్దకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఇదే రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లాలు చుట్టేస్తూ పలువురు ఇతర పార్టీలకు చెందిన నేతలతో చర్చిస్తున్న జేసీ.. తన పార్టీ నేతలు మాత్రం కలిసి చర్చించరాదన్న దిశగా వివాదాన్ని రేపడం నిజంగానే టీడీపీ అధిష్ఠానానికి కోపం తెప్పించిందనే చెప్పాలి. ఏదో సీనియర్ నేత కదా.. ఓ సారికి వదిలేద్దాంలే అంటూ టీడీపీ హైకమాండ్ దానిని పెద్దగా పట్టించుకోలేదు. హైకమాండ్ భావనను అర్థం చేసుకున్న సీమ నేతలు.. ప్రత్యేకించి అనంత నేతలు కూడా దానిని మరిచిపోయారనే చెప్పాలి. అయితే ఆ తరువాతే జేసీ విశ్వరూపం మొదలైపోయింది. తనకు సంబంధం లేని నియోజకవర్గాలకు వెళుతూ.. అక్కడి స్థానిక నేతలకు కనీస సమాచారం ఇవ్వకుండానే జేసీ తనదైన శైలి టూర్లకు తెర తీశారు. ఈ క్రమంలో పుట్టపర్తి రావద్దంటూ అక్కడి నేతలు చెబితే.. మీరెవరు నన్ను రావద్దనడానికి.. మీ ఆధీనంలోని కార్యాలయంలోకి రానీయకపోతే.. ఇక్కడే సెపరేట్‌గా పార్టీ కార్యాలయాన్ని తెరుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు టీడీపీలో పెను కలవరాన్నే రేపాయి.
దిద్దుబాటు చర్యలు షురూ
జేసీ తాజా వివాదంపై పలువురు కీలక నేతల నుంచి ఫిర్యాదులు అందుకున్న పార్టీ హైకమాండ్ ఈ తరహా చర్యలను ఆదిలోనే తుంచేయాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేరిట ఓ లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో ఏ ఒక్కరి పేరు తీయకుండానే.. కొందరు నేతలు అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. తమకు సంబంధం లేని నియోజకవర్గాల్లో పర్యటించే నేతల వైఖరిని సహించేది లేదని కూడా ఆ లేఖలో అచ్చెన్న హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు దేశం పార్టీని క్రమశిక్షణ కలిగిన పార్టీగా పేర్కొన్న అచ్చెన్న.. కొందరు నేతలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీకి అప్రతిష్ఠ తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు మాత్రమే నేతలు పరిమితం కావాలని, ఇతరుల నియోజకవర్గాల్లో అనవసరంగా ప్రవేశించి పార్టీ శ్రేణులను అయోమయంలోకి నెట్టరాదని కూడా సూచించారు. ఈ తరహా చర్యలపై పార్టీ హైకమాండ్ చూస్తూ ఊరుకోదని, పార్టీ తీసుకునే క్రమశిక్షణా చర్యలకు వారే బాధ్యులవుతారని కూడా అచ్చెన్న హెచ్చరించారు.
వార్నింగులన్నీ జేసీకేగా
అచ్చెన్న విడుదల చేసిన ప్రకటనలో ఏ ఒక్కరి పేరు లేకున్నా.. ఆ హెచ్చరికలన్నీ కూడా జేసీకే జారీ చేసినట్టుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ ప్రకటనలో కొందరు నేతలు అంటూ అచ్చెన్న ప్రస్తావించిన అంశాలన్నీ కూడా జేసీ చేపట్టిన కార్యక్రమాలేనని ఈజీగానే తెలిసిపోతోంది. ఇతర పార్టీల నేతలను కలుస్తున్న నేతగానే కాకుండా ఇతరుల నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. కార్యకర్తల్లో అయోమయం నెలకొనేలా వ్యవహరిస్తున్న నేతగా, సొంత పార్టీ నేతలపై విమర్శలు సంధిస్తున్న నేతగా టీడీపీలో జేసీ ప్రభాకర్ రెడ్డి పేరే వినిపిస్తోంది. ఈ లెక్కన అచ్చెన్న ప్రస్తావించిన హెచ్చరికలన్నీ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి చేసినవేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెరసి జేసీ తన తీరు మార్చుకోకపోతే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తప్పవని అచ్చెన్న ప్రకటన చెప్పకనే చెప్పిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జేసీ వస్తానంటే.. కేసీఆర్ ఒప్పుకుంటారా?











