మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా ప్రకాష్ రాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పోటీలో మంచు విష్ణు, జీవిత, హేమ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మంచు విష్ణు మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో మా అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ వేస్తుండటం గౌరవప్రదంగా భావిస్తున్నానని తెలిపాడు. మా కుటుంబ సభ్యుల బాధలు తనకు బాగా తెలుసన్న ఈ హీరో మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందామని పిలుపునిచ్చాడు.
తనకు, తన కుటుంబానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో రుణపడి ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈ ఇండస్ట్రీకి సేవ చేయడమే తన కర్తవ్యమన్నాడు. తండ్రి మోహన్‌బాబు మా అసోసియేషన్ కోసం చేసిన సేవలే తనకు ఆదర్శమని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు గతంలో మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేసిన అనుభవం కూడా ఉందన్నాడు. పెద్దల అనుభవాలు, యువరక్తం ఆలోచనలతో మా నడవాలనేదే తన ప్రయత్నమని చెప్పాడు. అందరి సహకారంతో విజయం సాధిస్తానని మంచు విష్ణు ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
కాగా మా ఎన్నికల్లో మంచు విష్ణుతో పాటు ప్రకాష్ రాజ్, జీవిత, హేమ కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానెల్‌ను కూడా ప్రకటించారు. ఈ ఎన్నికలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. ప్రకాష్ రాజ్ పోటీ చేస్తుండడంతో ఇప్పటికే నాన్ లోకల్ అంటూ వివాదం మొదలైంది. మరి.. రానున్న రోజుల్లో ఈ ఎన్నికలు ఇంకా ఎలాంటి వివాదాలను సృష్టిస్తాయో చూడాలి.